పోలవరంపై మా విచారణ కొనసాగిస్తాం : ఎన్జీటీ
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం పర్యావరణ అనుమతులు చెల్లవని దాఖలైన పిటిషన్‌ను తాము విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి వాదనలు వింటామని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లవని ‘రేలా’ అనే స్పచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం విచారించింది.
ఈ కేసులో గతంలో వాదనల సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు దాఖలైనందు వల్ల ఈ విషయంలో ప్రత్యేకంగా ఎన్జీటీలో విచారణ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీంతో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఎన్జీటీలో కూడా విచారణ అవసరమా? అని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అయితే సుప్రీం కోర్టులో పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో ఒక్క కేసు కూడా దాఖలు కాలేదని, అందువల్ల ఎన్జీటీలో తాము దాఖలు చేసిన కేసును విచారించాలని పిటిషనర్లు కోరారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ సోమవారం ఈ కేసును విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది అనూప్ జె బంబాని వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును నిర్మిస్తుండడమే కాకుండా.. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తోందని ట్రిబ్యునల్ దృష్టి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏకె. గంగూలి కల్పించుకొని పోలవరం ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఎన్జీటీలో విచారణ అవసరం లేదని మళ్లీ వాదించారు. ట్రిబ్యునల్ కల్పించుకొని.. ‘పోలవరం ప్రాజెక్టు విషయంలో çపర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో లేవు కదా. ఈ కేసును విచారించడానికి సుప్రీం కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు కదా’ అని పేర్కొంది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ పోలవరం పర్యావరణ అనుమతుల విషయంలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ కేసులో తుది వాదనలు వింటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.