12 ప్రాంతాల పై గురి!
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన తీవ్రవాది అరుణ సెల్వరాజ్ సాదాసీదా నేరస్తుడుకాదని తేలిపోయింది. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో సైతం దారుణ విధ్వంసాలకు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఒక్క చెన్నై నగరంలోనే 12 ప్రాంతాలను ఎంచుకున్నట్లు వెల్లడైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: విధ్వంసాలకు చెన్నై నగరంలోని 12 ప్రాంతాలను ఎంచుకున్నట్టు తీవ్రవాది అరుణ్‌సెల్వరాజ్ వెల్లడించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ప్రధానంగా.. శ్రీలంకలో ఒక స్టార్ హోటల్ యజమానిగా అరుణ్ సెల్వరాజ్ 2009 వరకు ఆడంబర జీవితాన్ని అనుభవించాడు. ఆ తరువాత వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడ్డాడు. తన పాత, కొత్త జీవితం తలుచుకుని దుఃఖించేవాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఒక ఆటో డ్రైవర్ తన సహచరుడిని పరిచయం చేశాడు.
అరుణ్ చేతిలో అతను సహాయంగా రూ.10వేలు పెట్టాడు. దీనికి ఆనందపరవశుడైన అరుణ్‌ను క్రమేణా తీవ్రవాద ఉచ్చులోకి దింపారు. తాము చెప్పిన పనులుచేస్తే మళ్లీ కోట్ల రూపాయాలు కళ్లచూడవచ్చని నూరిపోశారు. డబ్బుకు దాసోహమైన అరుణ్ కేవలం 28 ఏళ్ల వయస్సులోనే తీవ్రవాదిగా మారిపోయాడు. శ్రీలంక, భారత్‌లో స్వేచ్ఛగా సంచరించేలా పాకిస్తాన్ అతనికి పాస్‌పోర్టు సమకూర్చింది. 2009లో విద్యార్థి వీసాపై చెన్నై చేరుకుని సాలిగ్రామంలో నివాసం ఉంటూ ఈవెంట్ మేనేజర్‌గా అవతారం ఎత్తాడు.
ఆకాశంలో ఎగిరే బెలూన్‌లో పెళ్లి నిర్వహించి ప్రముఖునిగా మారిపోయాడు. ఈపేరు ప్రతిష్టలను అడ్డంపెట్టుకుని హార్బర్లలో, షిప్పులలో పెళ్లికి ప్రత్యేక అనుమతులు సంపాదించాడు. అదేసమయంలో హార్బర్ నలుమూలలా ఫొటోలుతీసి పాకిస్తాన్‌కు పంపేవాడు. ముంబయి తాజ్‌హోటల్ దాడులవలే అవకాశాలను తెలుపుతూ సముద్రతీరాలను అధ్యయనంచేసి ఫొటోలు పంపాడు. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు విమానం నడిపే శిక్షణకు దరఖాస్తు చేసుకున్నాడు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమాన హైజాక్‌తో బిల్‌లాడెన్ కూల్చివేసేందుకు అరుణ్‌ను ఉపయోగించుకోవాలని ఐఎస్‌ఐ భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విమాన శిక్షణకు అరుణ్ సమర్పించిన సర్టిఫికెట్లన్నీ నకిలీవిగా తేలడంతో వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. పాకిస్తాన్‌లో కుట్ర, శ్రీలంకలో వ్యూహరచన, తమిళనాడులో అమలుగా ఇతని కార్యకలాపాలు సాగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
12 ప్రాంతాలపై దృష్టి
నాలుగేళ్లుగా చెన్నైలో ఉంటూ నగరంలోని 12 ప్రాంతాలలో విధ్వంసాలు సృష్టించేందుకు అనుకూలమని అరుణ్ పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసినట్లు పోలీసులు కనుగొన్నారు. మెరీనా తీరంలోని సముద్రతీర గస్తీదళ కేంద్రం, కల్‌పాక్కం అణువిద్యుత్ కేంద్రం, పోలీస్ డీజీపీ కార్యాలయం, కోయంబేడులోని బస్‌స్టేషన్, మార్కెట్, సెంట్రల్ స్టేషన్, సెంట్రల్ ఎదురుగా ఉన్న జీహెచ్, తరమణిలోని టైడల్‌పార్క్, పరంగిమలైలోని ఆఫీసర్స్ శిక్షణ కేంద్రం, వండలూరులోని జాతీయ ప్రత్యేక భద్రతా దళం కేంద్రాల ఫొటోలను అరుణ్ సేకరించినట్లు సమాచారం.
అరుణ్ నుంచి స్వాధీనం చేసుకున్న లాప్‌టాప్‌లో అనేక మెయిళ్లు బయటపడ్డాయి. నగరంలో రద్దీ కూడళ్లు, వాటికి దారితీసే మార్గాలతో సహా పాకిస్తాన్‌కు చేరవేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం కొత్తగా సిద్ధం చేస్తున్న హరిహంత్ అనే సబ్‌మెరీన్ వివరాలను సైతం ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాడు. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను బట్టి అరుణ్ సెల్వరాజ్ సాధారణ తీవ్రవాది కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరిన్ని నిజాలు, కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.