Arun Selvaraj
-
ఐఎస్ఐ వెనుక ఐఏఎస్‌లు
చెన్నై, సాక్షి ప్రతినిధి : అరెస్టయిన తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకోక మునుపే హడలెత్తించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులతో అరుణ్‌కు సన్నిహిత పరిచయాలు ఉన్నట్లు జాతీయ ప్రత్యేక భద్రతా దళం (ఎన్ఐఏ) పరిశోధనలో వెలుగుచూసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య అనాదిగా దాయాదిపోరు సాగుతుండగా, శ్రీలంక, తమిళనాడు మధ్య ఈలం తమిళులు, సముద్రతీరంలో సరిహద్దు సమస్య, జాలర్ల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలు అవకాశంగా మారడంతో పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాద సంస్థకు శ్రీలంక ప్రభుత్వం తమ దేశంలో ఆశ్రయాన్ని కల్పించింది. శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడులో ప్రవేశించడం సులువైన మార్గంగా ఐఎస్ఐ భావించింది. శ్రీలంకలోని పాకి స్తాన్ రాయబార కార్యాలయ అధికారుల అండతో ఈ దిశగా అనేకమందిని సిద్ధం చేసింది. జాకీర్ హుస్సేన్, శివబాలన్, సలీమ్, రబీక్, మహ్మద్ హుస్సేన్, అరుణ్ సెల్వరాజ్‌లు వరుసగా అరెస్టయ్యారు. వీరిలో జాకీర్ హుస్సేన్, అరుణ్ సెల్వరాజ్ శ్రీలంక పౌరులుగా ఉన్నారు. శ్రీలంకలోని రాయబార కార్యాలయం కేంద్రంగా సాగించిన అనేక కుట్రలను ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టయిన జాకీర్ హుస్సేన్ వెల్లడించాడు. శ్రీలంకలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు అధికారులు కుట్రపన్నినట్లు జాకీర్ చెప్పాడు. రాయబార కార్యాలయ అధికారులు బాస్, సిద్దిక్, సిరాజ్తోపాటూ పేరు తెలియని మరో రాయబారిపై ఎన్ఐఏ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. అరుణ్‌తో ఐఏఎస్‌లు ఈవెంట్ మేనేజర్‌గా చలమాణి అయిన అరుణ్ సెల్వరాజ్ తన వృత్తిని అడ్డంపెట్టుకుని పలువురు ఐఏఎస్ అధికారులపై వలవిసిరినట్లు విచారణలో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శికి సన్నిహితునిగా వారింట జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించినట్లు తెలిసింది. ఆ కార్యక్రమంతో అరుణ్ మాజీ సీఎస్ కుటుంబ సభ్యుడిగా మారిపోయినట్లు గుర్తించారు. మాజీ సీఎస్ అండతో మరికొంత మంది ఐఏఎస్ అధికారులతో పరిచయాలు పెంచుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో విధ్వంస రచనకు సదరు ఐఏఎస్ అధికారులను అరుణ్ ఏమేరకు వినియోగించుకున్నాడని ఆరా తీస్తున్నారు. ఇంతకాలం తమ స్నేహితుడిగా చలామణిఐన అరుణ్ ఐఎస్ఐ తీవ్రవాదని బట్టబయలు కావడంతో సదరు ఐఏఎస్ అధికారులు ఆందోళన పడుతున్నారు. ఈవెంట్ మేనేజర్‌గా బాలీవుడ్లో అనేక వేడుకలు నిర్వహించి నటీనటులతో పరిచయాలు పెంచుకున్నట్లు తేటతెల్లమైంది. చెన్నై శివార్లలోని ఒక వైద్య కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడిపిన అరుణ్ ఆమె కోరిక మేరకు సదరు కళాశాలలో సైతం ఉచితంగా కోలీవుడ్ తారలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేసి అందరినీ తన ఉచ్చులోకి లాక్కోవడం అలవాటు ఉన్న అరుణ్‌ను కట్టడిచేసేలా అతని రెండు బ్యాంకు ఖాతాలను, రెండు పాస్‌పోర్టులను ఇప్పటికే సీజ్ చేశారు. మరిన్ని నిజాలను వెలికి తీసేందుకు వీలుగా అరుణ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
గస్తీ ముమ్మరం
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడులో ముంబై బాణీ దాడులకు సిద్ధమైనట్లు తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్ అరెస్ట్‌తో బట్టబయ లు కావడంతో సముద్రతీర జిల్లాల్లో గస్తీ ముమ్మరం చేశారు. శ్రీలంకకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన అరుణ్ సెల్వరాజ్‌ను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన జాతీయ ప్రత్యేక భద్రతా దళం అధికారులు అతని నుంచి అనేక కీలక సమాచారాన్ని రాబట్టారు. గతంలో సముద్రం గుండా ముంబయిలో ప్రవేశించి దారుణ విధ్వంసకాండను సృష్టించిన తరహాలో రాష్ట్రంలో దాడులు చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలుసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడదలిచిన ప్రాంతాల్లో తీవ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించి ఉండవచ్చని విశ్వసిస్తున్నారు. ఇన్ని పనులు అరుణ్ ఒక్కడే చక్కపెట్టలేడు. కనీసం ఐదుగురు అనుచరులు రాష్ట్రంలో సంచరిస్తున్నారని భావిస్తున్నారు. అరుణ్ అరెస్ట్ కావడం వల్ల అతని అనుచరులు ఆయా విధ్వంసాలను అమలు చేయడం లేదా సముద్రతీరాల గుండా పారిపోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో తంజావూరు, నాగపట్నం, రామనాధపురం జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. రాష్ట్రంలోకి రహస్యంగా ప్రవే శించేందుకు ఏఏ సముద్రతీరాలు అనుకూలం, ఎక్కడ విధ్వంసాలు సృష్టించవచ్చు అనే సమాచారం అరుణ్ ద్వారా ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరిపోయింది. ఈ కారణంగా అరుణ్ ప్రధానంగా గురిపెట్టిన 12 ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. అరుణ్ సెల్వరాజ్ గతంలో విడుదలై పులి దళంలో కూడా కొన్నాళ్లు పనిచేశాడు. శ్రీలంక ప్రభుత్వం అరుణ్ అరెస్ట్‌కు ప్రయత్నిస్తుండగా పాకిస్తాన్ తీవ్రవాదులు తెలివిగా అతన్ని చెన్నైకి పంపినట్లు తేలింది. శ్రీలంకలోని ఈలం తమిళులను అక్కడి పాకిస్తాన్ రాయబార కార్యాలయం వారు తీవ్రవాదులుగా మారుస్తున్నట్లు తేలింది. గతంలో పట్టుబడిన జాకీర్ హుస్సేన్, ప్రస్తుత అరుణ్ సైతం ఈలం తమిళులే. ఇలా ఇంకా ఎంత మంది ఈలం తమిళులు తీవ్రవాదులుగా మారి తమిళనాడులో ప్రవేశించారో తెలుసుకునేందుకు జాతీయ ప్రత్యేక భద్రతా దళం శనివారం శ్రీలంకకు పయనమైంది. -
12 ప్రాంతాల పై గురి!
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన తీవ్రవాది అరుణ సెల్వరాజ్ సాదాసీదా నేరస్తుడుకాదని తేలిపోయింది. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో సైతం దారుణ విధ్వంసాలకు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఒక్క చెన్నై నగరంలోనే 12 ప్రాంతాలను ఎంచుకున్నట్లు వెల్లడైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: విధ్వంసాలకు చెన్నై నగరంలోని 12 ప్రాంతాలను ఎంచుకున్నట్టు తీవ్రవాది అరుణ్‌సెల్వరాజ్ వెల్లడించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ప్రధానంగా.. శ్రీలంకలో ఒక స్టార్ హోటల్ యజమానిగా అరుణ్ సెల్వరాజ్ 2009 వరకు ఆడంబర జీవితాన్ని అనుభవించాడు. ఆ తరువాత వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడ్డాడు. తన పాత, కొత్త జీవితం తలుచుకుని దుఃఖించేవాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఒక ఆటో డ్రైవర్ తన సహచరుడిని పరిచయం చేశాడు. అరుణ్ చేతిలో అతను సహాయంగా రూ.10వేలు పెట్టాడు. దీనికి ఆనందపరవశుడైన అరుణ్‌ను క్రమేణా తీవ్రవాద ఉచ్చులోకి దింపారు. తాము చెప్పిన పనులుచేస్తే మళ్లీ కోట్ల రూపాయాలు కళ్లచూడవచ్చని నూరిపోశారు. డబ్బుకు దాసోహమైన అరుణ్ కేవలం 28 ఏళ్ల వయస్సులోనే తీవ్రవాదిగా మారిపోయాడు. శ్రీలంక, భారత్‌లో స్వేచ్ఛగా సంచరించేలా పాకిస్తాన్ అతనికి పాస్‌పోర్టు సమకూర్చింది. 2009లో విద్యార్థి వీసాపై చెన్నై చేరుకుని సాలిగ్రామంలో నివాసం ఉంటూ ఈవెంట్ మేనేజర్‌గా అవతారం ఎత్తాడు. ఆకాశంలో ఎగిరే బెలూన్‌లో పెళ్లి నిర్వహించి ప్రముఖునిగా మారిపోయాడు. ఈపేరు ప్రతిష్టలను అడ్డంపెట్టుకుని హార్బర్లలో, షిప్పులలో పెళ్లికి ప్రత్యేక అనుమతులు సంపాదించాడు. అదేసమయంలో హార్బర్ నలుమూలలా ఫొటోలుతీసి పాకిస్తాన్‌కు పంపేవాడు. ముంబయి తాజ్‌హోటల్ దాడులవలే అవకాశాలను తెలుపుతూ సముద్రతీరాలను అధ్యయనంచేసి ఫొటోలు పంపాడు. ఐఎస్ఐ ఆదేశాల మేరకు విమానం నడిపే శిక్షణకు దరఖాస్తు చేసుకున్నాడు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమాన హైజాక్‌తో బిల్లాడెన్ కూల్చివేసేందుకు అరుణ్‌ను ఉపయోగించుకోవాలని ఐఎస్ఐ భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విమాన శిక్షణకు అరుణ్ సమర్పించిన సర్టిఫికెట్లన్నీ నకిలీవిగా తేలడంతో వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. పాకిస్తాన్లో కుట్ర, శ్రీలంకలో వ్యూహరచన, తమిళనాడులో అమలుగా ఇతని కార్యకలాపాలు సాగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. 12 ప్రాంతాలపై దృష్టి నాలుగేళ్లుగా చెన్నైలో ఉంటూ నగరంలోని 12 ప్రాంతాలలో విధ్వంసాలు సృష్టించేందుకు అనుకూలమని అరుణ్ పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసినట్లు పోలీసులు కనుగొన్నారు. మెరీనా తీరంలోని సముద్రతీర గస్తీదళ కేంద్రం, కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం, పోలీస్ డీజీపీ కార్యాలయం, కోయంబేడులోని బస్‌స్టేషన్, మార్కెట్, సెంట్రల్ స్టేషన్, సెంట్రల్ ఎదురుగా ఉన్న జీహెచ్, తరమణిలోని టైడల్‌పార్క్, పరంగిమలైలోని ఆఫీసర్స్ శిక్షణ కేంద్రం, వండలూరులోని జాతీయ ప్రత్యేక భద్రతా దళం కేంద్రాల ఫొటోలను అరుణ్ సేకరించినట్లు సమాచారం. అరుణ్ నుంచి స్వాధీనం చేసుకున్న లాప్టాప్లో అనేక మెయిళ్లు బయటపడ్డాయి. నగరంలో రద్దీ కూడళ్లు, వాటికి దారితీసే మార్గాలతో సహా పాకిస్తాన్‌కు చేరవేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం కొత్తగా సిద్ధం చేస్తున్న హరిహంత్ అనే సబ్మెరీన్ వివరాలను సైతం ఐఎస్ఐ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాడు. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను బట్టి అరుణ్ సెల్వరాజ్ సాధారణ తీవ్రవాది కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరిన్ని నిజాలు, కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
అరుణ్ గుప్పిట్లో విశాఖ నేవల్ బేస్ సమాచారం
* చెన్నై కోర్టులో సెల్వరాజన్ హాజరు.. 14 రోజుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న శ్రీలంక జాతీయుడు అరుణ్ సెల్వరాజన్ వద్ద విశాఖపట్నం నావికాదళ కేంద్రానికి చెందిన కీలక ఫొటోలు, సమాచారం లభ్యమైనట్టు తెలిసింది. అరుణ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే. అతని వద్ద నుంచి ఎన్ఐఏ అధికారులు విశాఖ నేవల్‌బేస్‌కు చెందిన ఫొటోలు, సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా అరుణ్ నివాసం, కార్యాలయం నుంచి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ గురువారం ప్రకటించింది. కాగా అరుణ్‌ను ఎన్ఐఏ గురువారం చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.