చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడులో ముంబై బాణీ దాడులకు సిద్ధమైనట్లు తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్ అరెస్ట్‌తో బట్టబయ లు కావడంతో సముద్రతీర జిల్లాల్లో గస్తీ ముమ్మరం చేశారు. శ్రీలంకకు చెందిన పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగిన అరుణ్ సెల్వరాజ్‌ను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన జాతీయ ప్రత్యేక భద్రతా దళం అధికారులు అతని నుంచి అనేక కీలక సమాచారాన్ని రాబట్టారు. గతంలో సముద్రం గుండా ముంబయిలో ప్రవేశించి దారుణ విధ్వంసకాండను సృష్టించిన తరహాలో రాష్ట్రంలో దాడులు చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలుసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడదలిచిన ప్రాంతాల్లో తీవ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించి ఉండవచ్చని విశ్వసిస్తున్నారు.
ఇన్ని పనులు అరుణ్ ఒక్కడే చక్కపెట్టలేడు. కనీసం ఐదుగురు అనుచరులు రాష్ట్రంలో సంచరిస్తున్నారని భావిస్తున్నారు. అరుణ్ అరెస్ట్ కావడం వల్ల అతని అనుచరులు ఆయా విధ్వంసాలను అమలు చేయడం లేదా సముద్రతీరాల గుండా పారిపోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో తంజావూరు, నాగపట్నం, రామనాధపురం జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. రాష్ట్రంలోకి రహస్యంగా ప్రవే శించేందుకు ఏఏ సముద్రతీరాలు అనుకూలం, ఎక్కడ విధ్వంసాలు సృష్టించవచ్చు అనే సమాచారం అరుణ్ ద్వారా ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరిపోయింది. ఈ కారణంగా అరుణ్ ప్రధానంగా గురిపెట్టిన 12 ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు.
అరుణ్ సెల్వరాజ్ గతంలో విడుదలై పులి దళంలో కూడా కొన్నాళ్లు పనిచేశాడు. శ్రీలంక ప్రభుత్వం అరుణ్ అరెస్ట్‌కు ప్రయత్నిస్తుండగా పాకిస్తాన్ తీవ్రవాదులు తెలివిగా అతన్ని చెన్నైకి పంపినట్లు తేలింది. శ్రీలంకలోని ఈలం తమిళులను అక్కడి పాకిస్తాన్ రాయబార కార్యాలయం వారు తీవ్రవాదులుగా మారుస్తున్నట్లు తేలింది. గతంలో పట్టుబడిన జాకీర్ హుస్సేన్, ప్రస్తుత అరుణ్ సైతం ఈలం తమిళులే. ఇలా ఇంకా ఎంత మంది ఈలం తమిళులు తీవ్రవాదులుగా మారి తమిళనాడులో ప్రవేశించారో తెలుసుకునేందుకు జాతీయ ప్రత్యేక భద్రతా దళం శనివారం శ్రీలంకకు పయనమైంది.
గస్తీ ముమ్మరం
Published Sun, Sep 14 2014 12:59 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM
Advertisement
Advertisement