ఐఎస్‌ఐ వెనుక ఐఏఎస్‌లు
చెన్నై, సాక్షి ప్రతినిధి : అరెస్టయిన తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకోక మునుపే హడలెత్తించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులతో అరుణ్‌కు సన్నిహిత పరిచయాలు ఉన్నట్లు జాతీయ ప్రత్యేక భద్రతా దళం (ఎన్‌ఐఏ) పరిశోధనలో వెలుగుచూసింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య అనాదిగా దాయాదిపోరు సాగుతుండగా, శ్రీలంక, తమిళనాడు మధ్య ఈలం తమిళులు, సముద్రతీరంలో సరిహద్దు సమస్య, జాలర్ల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలు అవకాశంగా మారడంతో పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ తీవ్రవాద సంస్థకు శ్రీలంక ప్రభుత్వం తమ దేశంలో ఆశ్రయాన్ని కల్పించింది.
శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడులో ప్రవేశించడం సులువైన మార్గంగా ఐఎస్‌ఐ భావించింది. శ్రీలంకలోని పాకి స్తాన్ రాయబార కార్యాలయ అధికారుల అండతో ఈ దిశగా అనేకమందిని సిద్ధం చేసింది. జాకీర్ హుస్సేన్, శివబాలన్, సలీమ్, రబీక్, మహ్మద్ హుస్సేన్, అరుణ్ సెల్వరాజ్‌లు వరుసగా అరెస్టయ్యారు. వీరిలో జాకీర్ హుస్సేన్, అరుణ్ సెల్వరాజ్ శ్రీలంక పౌరులుగా ఉన్నారు. శ్రీలంకలోని రాయబార కార్యాలయం కేంద్రంగా సాగించిన అనేక కుట్రలను ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టయిన జాకీర్ హుస్సేన్ వెల్లడించాడు. శ్రీలంకలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు అధికారులు కుట్రపన్నినట్లు జాకీర్ చెప్పాడు. రాయబార కార్యాలయ అధికారులు బాస్, సిద్దిక్, సిరాజ్‌తోపాటూ పేరు తెలియని మరో రాయబారిపై ఎన్‌ఐఏ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు.
అరుణ్‌తో ఐఏఎస్‌లు
ఈవెంట్ మేనేజర్‌గా చలమాణి అయిన అరుణ్ సెల్వరాజ్ తన వృత్తిని అడ్డంపెట్టుకుని పలువురు ఐఏఎస్ అధికారులపై వలవిసిరినట్లు విచారణలో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శికి సన్నిహితునిగా వారింట జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించినట్లు తెలిసింది. ఆ కార్యక్రమంతో అరుణ్ మాజీ సీఎస్ కుటుంబ సభ్యుడిగా మారిపోయినట్లు గుర్తించారు. మాజీ సీఎస్ అండతో మరికొంత మంది ఐఏఎస్ అధికారులతో పరిచయాలు పెంచుకున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో విధ్వంస రచనకు సదరు ఐఏఎస్ అధికారులను అరుణ్ ఏమేరకు వినియోగించుకున్నాడని ఆరా తీస్తున్నారు. ఇంతకాలం తమ స్నేహితుడిగా చలామణిఐన అరుణ్ ఐఎస్‌ఐ తీవ్రవాదని బట్టబయలు కావడంతో సదరు ఐఏఎస్ అధికారులు ఆందోళన పడుతున్నారు. ఈవెంట్ మేనేజర్‌గా బాలీవుడ్‌లో అనేక వేడుకలు నిర్వహించి నటీనటులతో పరిచయాలు పెంచుకున్నట్లు తేటతెల్లమైంది. చెన్నై శివార్లలోని ఒక వైద్య కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడిపిన అరుణ్ ఆమె కోరిక మేరకు సదరు కళాశాలలో సైతం ఉచితంగా కోలీవుడ్ తారలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలుసుకున్నారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేసి అందరినీ తన ఉచ్చులోకి లాక్కోవడం అలవాటు ఉన్న అరుణ్‌ను కట్టడిచేసేలా అతని రెండు బ్యాంకు ఖాతాలను, రెండు పాస్‌పోర్టులను ఇప్పటికే సీజ్ చేశారు. మరిన్ని నిజాలను వెలికి తీసేందుకు వీలుగా అరుణ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.