ఎన్ఐఏ అధికారి హత్య: దర్యాప్తులో కీలక మలుపు
లక్నో: భారత్ లోనేకాక పాకిస్థాన్ లోనూ సంచలనం కలిగించిన ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యకుసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. స్వగ్రామం సాహస్ పూర్ లో తంజీల్ హాజరైన వివాహవేడుకకు హాజరైన ఇద్దరు వ్యక్తులే హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పెళ్లి వీడియోను కూలంకషంగా పరిశీలించారు. ఇద్దరు ఆ అనుమానితుల్లో ఒకరిని ఆర్షిగా గుర్తించామని, అతను తంజీల్ కుటుంబానికి స్నేహితుడని బిజ్నూర్ ఎస్పీ సుభాస్ సింగ్ బఘేల్ తెలిపారు. రెండో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సిఉందన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే తంజీల్ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు.
పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న మొహమ్మద్ తంజీల్ అహ్మద్ గత ఆదివారం స్వగ్రామంలో జరిగిన వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ శరీం ఛిధ్రమైపోయి అక్కడికక్కడే మరణిచారు. అతని పక్కసీట్లో కూర్చున్న భార్య ఫాతిమాకు నాలుగు బెల్లెట్లు తగిలాయి. నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఫాతిమా ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
అనేక విమర్శలు చెలరేగిన నేపథ్యంలో తంజీల్ హత్యకేసు సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం ఎనిమిది బృందాలను ఏర్పాటుచేశారు. యూపీలోని డ్రగ్స్ మాఫియా, హవాలా వ్యాపారులు సహా మాజీ నేరస్తులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీలనైన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించామని, లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ముగింపునకు వచ్చేఅవకాశం ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు.