ఆకట్టుకుంటున్న నీలగిరి ఫ్రూట్ షో..
కోనూర్: తమిళనాడులోని కూనూరులో 57వ ఫ్రూట్స్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది వేసవిలో జరిగే ప్రదర్శనలో భాగంగా శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన రెండురోజుల పాటు కొనసాగనుంది. రకరకాల పళ్లతో తయారుచేసిన జంతువుల బొమ్మలు ప్రదర్శనలో కొలువుదీరాయి. హార్టికల్చర్ విభాగం వన్యప్రాణి సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఏర్పాటచేసిన ఈ షోను నీలగిరి జిల్లా కూనూరులోని సిమీస్ పార్క్లో జిల్లా కలెక్టర్ పి. శంకర్ ప్రారంభించారు.
రకరకాల పళ్లతో, వివిధ ఆకృతులతో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన.. టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ద్రాక్షలు, ఆరెంజ్, యాపిల్, నిమ్మ, అరటి తదితర రకారకాల పళ్లతో చేసిన జంతువుల ఆకృతులు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా ద్రాక్షలతో చేసిన ఏనుగు, ఆరెంజ్, నిమ్మ పళ్లతో చేసిన సింహం బొమ్మలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 7 అడుగుల ఎత్తుతో టోపీ పెట్టుకుని ఉన్న సైనికుని విగ్రహం, 15 అడుగుల పొడవైన ద్వారం మరింత ఆకట్టుకుంటున్నాయి.