ఊటీ అందాలను తిలకించేందుకు వెళ్లిన మిత్ర బృందం అదృశ్యం అయ్యింది. రెండు రోజులుగా రిసార్ట్‌కు ఆ బృందం తిరిగి రాకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు ముమ్మరం చేయడంతో ఓ లోయలో ఆ బృందం వెళ్లిన కారును గుర్తించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఐదుగురు మరణించగా, కొన ఊపిరితో ఉన్న ఇద్దర్ని రెస్క్యూ టీం రక్షించింది.
సాక్షి, చెన్నై : చెన్నైకి చెందిన మిత్ర బృందం రామరాజేష్, రవివర్మ, ఇబ్రహీం, జయకుమార్, అరుణ్, అమర్‌నాథ్, జూడో గత నెల 30న చెన్నై నుంచి ఓ కారులో ఊటీకి వెళ్లారు. అక్కడి ఓ రిసార్ట్‌ను అద్దెకు తీసుకున్నారు. తొలిరోజు ఊటీలో ఉన్న ఈ మిత్రులు, ఒకటో తేదీన ముదుమలై శరణాలయం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఎంతకు తిరిగి రాలేదు. రెండు రోజలైనా ఆ ఏడుగురు తిరిగిరాక పోవడం, రిసార్ట్ సిబ్బందిలో అనుమానాలు నెలకొన్నాయి. వెళ్లిన వారు అదృశ్యం కావడంతో, వారు ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్చేశారు. అవన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. బుధవారం మధ్యాహ్నం ఊటీ పోలీసులకు విషయాన్ని అందించారు.
లోయలో కారు
రిసార్ట్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఊటీ నుంచి ముదుమలై వైపు మార్గంలో పరిశీలన చేపట్టారు. కళ్లట్టిమలుపు 35వ క్రాస్ వద్ద ఆగిన ఆ ప్రత్యేక బృందం అక్కడి లోయ మీద దృష్టి పెట్టింది. లోయలో చెట్ల మధ్యలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఆందోళన బయలుదేరింది. ఆ పరిసరాలు పొదళ్లతో నిండి ఉండడంతో లోయలో దిగడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద ఒకరిద్దరు లోయలోకి దిగారు. అయినా, కారును సమీపించలేని పరిస్థితి. దీంతో రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. ఈ బృందం అతి కష్టం మీద కారును సమీపించింది.
ఐదుగురు బలి
ఐదుగురు విగత జీవులయ్యారు. ఇద్దరు కొన ఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. ఓ వైపు చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆగమేఘాలపై లైటింగ్ ఏర్పాట్లు చేసి లోయలో ఉన్న కారులో కొన ఊపిరితో ఉన్న ఇద్దరినీ రక్షించారు. అతి కష్టం మీద వారిని పైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతుండడంతో గాయాలతో ఉన్న ఆ ఇద్దరు ఏ మేరకు నరకాన్ని అనుభవించి ఉంటారో వర్ణణాతీతం. పొదలతో కూడిన లోయ కావడంతో ఎవరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి. ఈ సమాచారం చెన్నైలోని ఆ ఏడుగురి కుటుంబాల్ని ఆందోళనలో పడేసింది. ఊటీకి పరుగులు తీశారు. కాగా, ముదుమలై శరణాలయానికి వెళ్లే మార్గంలో వాహనం అదుపు తప్పి లోయలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోయలోకి కారు దూసుకెళ్లిన సమయంలో పిట్ట గోడల వద్ద ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. దీంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతి చెందిన ఐదుగురిలో రవి వర్మ, అమరనాథ్, జూడో, జయకుమార్, ఇబ్రహీం ఉన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామరాజేష్, అరుణ్‌లకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు స్పృహలోకి వస్తేనే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో తేలనుంది.
విహార యాత్రలో పాల్గొన్న వారి ఫోటో (మూలం: సోషల్ మీడియా)
Comments
Please login to add a commentAdd a comment