ఊటీకి టూరెళ్దామా? అంటే ఎగిరి గంతేసిన బాల్యం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. మధ్యతరం ఊటీలో ఏముంది అవే టీ తోటలు, అదే దొడబెట్ట, అదే టాయ్ ట్రైన్, బొటానికల్ గార్డెన్, పాటలు చిత్రీకరించిన కూనూరు... అని పెదవి విరిచేశాయి. డెబ్బై, ఎనభైల దక్షిణాది సినిమాల్లో చూసిందే కదా ఊటీ అని తేల్చేయడమూ కరెక్టే. అయితే ఊటీ అంటే సినిమాల్లో చూసిన ఊటీ మాత్రమే కాదు. ఇంకా చూడాల్సిన ఊటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఎకో టూరిజమ్‌లో ఊటీకి పాతిక కిలోమీటర్ల దూరాన నీలగిరుల్లో విస్తరించిన అవలాంచే సరస్సు వైపు అడుగులు వేద్దాం.
మెల్లగా సాగే ప్రయాణం... ఊటీ ఎకో టూరిజమ్ అవలాంచె చెక్‌పోస్ట్ నుంచి మొదలవుతుంది. ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో మూడు వ్యూ పాయింట్లు ఉంటాయి. షోలా ఫారెస్ట్ వ్యూ పాయింట్. మరికొంత దూరంలో భవానీ ఆలయం, లక్కడి. ఈ మూడు పాయింట్లను కలుపుతూ రౌండ్ ట్రిప్ ఇది. ప్రయాణం వేగంగా గమ్యానికి చేరాలన్నట్లు ఉండదు. ప్రదేశాన్ని ఆసాంతం కళ్లారా చూడడానికి రెండు గంటల సేపు సాగుతుంది. తిరిగి అవలాంచె చెక్‌పోస్టు దగ్గర దింపుతారు.
పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం... అవలాంచె సరస్సు చేరడానికి సన్నటి రోడ్డు మీద సాగే ప్రయాణం. ప్రకృతి సౌందర్యంతో΄ాటు కొండ శిఖరాలను చూడవచ్చు. భవానీ ఆలయం నుంచి అరకిలోమీటరు దూరం నడిస్తే అందమైన జల΄ాతం, అప్పర్ భవానీ డ్యామ్ బ్యాక్ వాటర్స్ కనువిందు చేస్తాయి. భవానీ నది కేరళలోని పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ తమిళనాడుకి వచ్చి కావేరినదిలో కలుస్తుంది.
గిరి జనపథం... ఊటీ ఎకో టూరిజమ్ జోన్‌లోకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. పర్యాటకుల వాహనాలు అవలాంచె చెక్‌పోస్ట్ దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి టూరిజమ్ డిపార్ట్‌మెంట్ వాహనంలోకి మారాలి. విడిగా ట్రిప్ కావాలనుకుంటే ఎనిమిది మందికి ఒక జీపు ఏర్పాటు చేస్తారు. ఈ టూర్‌లో నీలగిరుల్లో టోడా గిరిజన తెగ నివసించే ప్రదేశాలను కూడా చూడవచ్చు. వారి ఇళ్ల నిర్మాణం, దుస్తుల మీద వారు చేసే ఎంబ్రాయిడరీ ప్రత్యేకమైనవి. ఒక చేతిరుమాలైనా కొనుక్కుంటే ఆ కళకు ్రపోత్సాహంగానూ, టూర్‌కి గుర్తుగానూ ఉంటుంది.
∙
Comments
Please login to add a commentAdd a comment