
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుండగానే 9 లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,498 కేసులు బయటపడ్డాయి. 553 మంది కరోనా బాధితులు మృతిచెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 9,06,752కు, మరణాలు 23,727కు ఎగబాకాయి. 5,71,459 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం 3,11,565 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో 86 శాతం కరోనా పాజిటివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే బయటపడ్డాయని అన్నారు. దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
సెల్ఫ్ క్వారంటైన్‌లో రాంమాధవ్
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ వారంలోనే 10 లక్షల మార్కును దాటనుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ఇకనైనా కఠినమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్తను ఈ ట్వీట్‌తో జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment