సరిహద్దులో ఉద్రిక్తత
లఖింపుర్ ఖేరీ(యూపీ) :
భారత్ నేపాల్ సరిహద్దును పహారా కాసే సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) జవాన్లపై నేపాలీలు గురువారం రాళ్లవర్షం కురిపించారు. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న పిల్లర్ నంబర్ 200 ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కల్వర్టును ఎస్‌ఎస్‌బీ అడ్డుకోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దాడిలో 9 మంది జవాన్లు, కొందరు స్థానికులకు గాయాలయినట్లు సీనియర్ ఎస్‌ఎస్‌బీ అధికారులు తెలిపారు.
సరిహద్దులో కాల్పులు జరిగాయన్న మీడియా కథనాలను వారు ఖండించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలతో కలిసి స్థానిక పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో ప్రజలు శాంతిగా ఉండి ఇరుదేశాల సర్వే అధికారులను వారి పని చేయనివ్వాలని కోరింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆకాశ్ దీప్ పరిస్థితుల్ని వెంటనే నేపాల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సరిహద్దులో కనిపించకుండా పోయిన పిల్లర్ నంబర్ 200 గురించి ఇరుదేశాల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సరిహద్దు నిర్ధారణ అయ్యేవరకూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే కొందరు స్థానిక నేపాలీలు మాత్రం బుధవారం కల్వర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దీన్ని గుర్తించిన ఎస్‌ఎస్‌బీ జవాన్లు వారిని అడ్డుకున్నారు. దీంతో నేపాలీలు జవాన్లపై రాళ్లవర్షం కురిపించారు. సరిహద్దులో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.