జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థి ముఖేష్ సురక్షితంగా ఉన్నాడు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థి ముఖేష్ సురక్షితంగా ఉన్నాడు. కాలేజీ క్యాంపస్లోకి భారీగా వరద నీరు చేరడంతో కొట్టుకుపోయిన ముఖేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందించాడు. కాగా నిరాశ్రయుడు కావడంతో తన దగ్గర డబ్బులు లేవని, సాయం చేయాల్సిందిగా ముఖేష్ ప్రభుత్వాన్ని కోరాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నాడు.
జమ్మూకాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఎన్ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ముఖేష్ వరదల్లో చిక్కుకుపోవడంతో సహ విద్యార్థులతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అతను సురక్షితంగా ఉన్నాడని సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు.