సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తితో సంక్షోభంలో కూరుకుపోయిన ఎకానమీలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈఎంఐల చెల్లింపుపై ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం విధించినా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నందున కేంద్ర ప్యాకేజ్ అనివార్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తుందని,అయితే ప్రభుత్వానికి ఉన్న పరిమితులనూ గుర్తెరగాలని చిన్నమధ్యతరహా పరిశమ్రలు, రవాణా, హైవే మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
మహమ్మారి ప్రభావానికి లోనైన ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు తాము చేయగలిగినంతా చేస్తున్నామని స్పష్టం చేశారు. అమెరికా..జపాన్‌ల ఆర్థిక వ్యవస్ధలు భారత్ కంటే పెద్దవి అయినందునే భారీ ప్యాకేజ్‌లు ప్రకటించాయని గుర్తుచేశారు. కరోనా మహమ్మారితో ప్రభావితమైన వారికి ఊరటగా ఆర్‌బీఐ మార్చి 27న మూడునెలల పాటు ఈఎంఐ చెల్లింపులను నిలుపుదల చేస్తూ ప్రకటన చేసిందని అన్నారు. ఆదాయపన్ను, జీఎస్టీ రిఫండ్‌లను తక్షణమే ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించానని తెలంగాణ పరిశ్రమ సంస్థతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తెలిపారు. పరిశ్రమకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ప్యాకేజ్‌ను ప్రకటిస్తుందని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment