సోనియాకు ముఖ్యమంత్రి ఝలక్!
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న సోనియాగాంధీ ఆశలకు ఆరంభంలోనే గండిపడేలా ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆమె ప్రయత్నాలకు గండికొట్టారు. జూలై నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం విపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టి, ఎన్డీయే సర్కారుకు వణుకు పుట్టించాలని తొలుత భావించారు. ఈ విషయం గురించి చర్చించేందుకు తన ఇంట్లో శుక్రవారం నాడు ఓ విందు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కావడం లేదు. ఆయనకు బదులుగా పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ మాత్రం ఆ భేటీకి వెళ్తారట.
బిహార్ ప్రభుత్వంలో జేడీ(యూ) భాగస్వామ్య పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ తరఫున లాలు ప్రసాద్ వెళ్తున్నారు. వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా కూడా ఈ సమావేశానికి వెళ్తారు. ఇప్పటికే ఈ అంశంపై సోనియాను ఒకసారి కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం హాజరవుతున్నారు. అయితే.. ఈ సమావేశం వెనుక కాంగ్రెస్ వ్యూహం వేరేలా ఉంది. ఈ ఐక్యతను కేవలం రాష్ట్రపతి ఎన్నికలకే పరిమితం చేయకుండా.. భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల ఐక్యత ఉండేలా చూడాలని కాంగ్రెస్ అధినేత్రి భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడాలంటే కేవలం తామొక్కరి వల్ల కాదని, అందువల్ల ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ కూటములుగా ఏర్పడాలని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి అడుగుగా రాష్ట్రపతి ఎన్నికల్లో దీటైన పోటీ ఇవ్వాలని, అందుకు అన్ని పార్టీలూ ఒక్కటిగా నిలవాలని అంటున్నారు. అందుకే అన్ని పక్షాలను విందు సమావేశం పేరుతో తన ఇంటికి ఆహ్వానించారు. అయితే.. నితీష్ కుమార్ కావాలనే తప్పుకొంటున్నారా, లేదా తాత్కాలికంగా దూరంగా ఉంటున్నారా అనే విషయం ఇంకా తెలియడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ముందుగా స్వాగతించినవాళ్లలో నితీష్ కుమార్ కూడా ఒకరు. ఒక పెయింటింగ్ ప్రదర్శనకు వెళ్లినప్పుడు కమలం పువ్వును గీస్తూ ఆయన కనిపించారు. దాంతో నితీష్ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ వ్యాఖ్యలు వచ్చాయి.