రాష్ట్రపతి పాలన.. ఇప్పటికైతే లేదు: సుశీల్ కుమార్ షిండే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో.. రాష్ట్ర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో లేవని స్పష్టం చేశారు. మంగళవారం కేంద్ర మంత్రివర్గ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం ఆందోళన చెందుతోందని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని షిండే పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి, భద్రతల పరిస్థితి కేంద్రం జోక్యం చేసుకోవాల్సినంతగా విషమించలేదన్నదే తన అభిప్రాయమని చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నామని, విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని షిండే వివరించారు. అవసరమైతే ఇందుకోసం విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) ప్రయోగిస్తామని అన్నారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్ కుప్పకూలవచ్చన్న భయాందోళనలు అవసరం లేదన్నారు.
సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడతాం
విభజన అనంతరం తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని షిండే చెప్పారు. సీమాంధ్ర యువతీ, యువకులకు విద్య, ఉద్యోగ అవకాశాలకు చట్టబద్ధమైన గ్యారంటీలు కల్పిస్తామని తెలిపారు. నదీజలాలు, విద్యుదుత్పత్తి, పంపిణీ, ఉద్యోగుల ఆందోళనలు.. తదితర సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించే ప్రక్రియను కేంద్ర మంత్రుల బృందం ప్రారంభించిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు అంగీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు నిరాహారదీక్షలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తావనకు రాని ‘ఉద్రిక్త పరిస్థితి’
ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి ప్రస్తావనకు రాలేదని తెలిసింది. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి సోమవారం ప్రధానితో సమావేశమైన హోం మంత్రి షిండే రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయనకు నివేదికను సమర్పించినట్లు సమాచారం.