
సాక్షి, శ్రీనగర్ : ఈద్ సందర్భంగా భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏటా కనిపించే దృశ్యాలకు భిన్నంగా ఈసారి గంభీర వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అట్టారి-వాగా సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు పరస్పరం స్వీట్లు పంచుకోలేదు. జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈద్ సందర్భంగా ఇరు దేశాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్వీట్లు పంచుకోవడానికి దూరంగా ఉన్నారు.
రాజౌరిలోని నౌషెరా బ్లాక్‌లో శనివారం సైతం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ భారత జవాన్ మరణించారు. ఇక ఈద్, దీపావళి వంటి పర్వదినాల్లో, స్వాతంత్ర్యదినం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఇరు దేశాల జవాన్లు స్వీట్లు పంచుకుని సందడి చేసేవారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజునా పాకిస్తాన్ రేంజర్లతో స్వీట్లు పంచుకునే సంప్రదాయానికి బీఎస్‌ఎఫ్ స్వస్తిపలకడం గమనార్హం. అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ యదేచ్ఛగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటానికి నిరసనగా బీఎస్‌ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.