అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం | No Indian military boots on Afghan soil | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం

Published Wed, Sep 27 2017 1:29 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

No Indian military boots on Afghan soil - Sakshi

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు భారత్‌ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్‌ అభివృద్ధికి సంబంధించి సహాయం కొనసాగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, జేమ్స్‌ మాటిస్‌ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ సాయంపై చర్చలు జరిగాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాటిస్‌ చర్చించారు. 

చర్చల అనంతరం సీతారామన్, మేటిస్‌లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని, అలాగే శాంతియుతమైన, స్థిరమైన, ప్రజాస్వామ్య అఫ్గానిస్థాన్‌ కోసం అఫ్గాన్‌ ప్రభుత్వానికి సహాయం కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే అఫ్గాన్‌కు భారత బలగాలను పంపబోమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

అఫ్గాన్‌కు భారత్‌ మరింత సహాయపడాలంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన అఫ్గాన్‌ పాలసీ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ పాలసీని భారత్‌ స్వాగతిస్తుందని, అఫ్గాన్‌ పునర్నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తామని, సైనిక బలగాల తరలింపులో మాత్రం తమ వైఖరిలో మార్పు ఉండబోదని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌కు సంబంధించి భారత్‌ అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని మాటిస్‌ చెప్పారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సాయం అందించే అంశంపై లోతుగా చర్చలు జరిపినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

పాక్‌లో పర్యటించినప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తాలని మాటిస్‌ను కోరినట్టు వెల్లడించారు. పాక్‌లోని ఉగ్రవాద స్వర్గధామాలను సహించరాదని భారత్‌–అమెరికా నిర్ణయించినట్టు చెప్పారు. మాటిస్‌ స్పందిస్తూ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. అమెరికా, భారత్‌ మధ్య సహకారం వల్ల ఇరు దేశాలకూ లబ్ధి చేకూరుతుందని, రెండు దేశాల మధ్య నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ఇటీవల ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇండో–పసిఫిక్‌ రీజియన్‌లో తీర ప్రాంత భదత్రపై సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని సీతారామన్‌ తెలిపారు.  


మోదీతో మాటిస్‌ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ– మాటిస్‌ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్, అమెరికాల ఉమ్మడి ప్రాధాన్యత అంశాలైన శాంతి, స్థిరత్వం, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాల్లో విస్తృత సహకారంపై మోదీ, మాటిస్‌ల మధ్య చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సన్నిహిత సంబంధాల్ని మోదీ కొనియాడారని పీఎంవో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విస్తృత స్థాయిలో ఫలవంతంగా సాగిన చర్చల్ని భేటీలో ప్రధాని మోదీ గుర్తుచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement