మాయావతికి మరో ఎదురుదెబ్బ!
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతికి మరో ఎదురుదెబ్బ తగిలింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యపరిచాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషీన్ల(ఈవీఎం) లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని, రాష్ట్ర ప్రజలు ఓటింగ్ యంత్రాలను విశ్వసించడం లేదని ఆరోపిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని మాయావతి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై ఈసీ స్పందించింది. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. ఆమె లేఖను చట్టబద్దంగా తీసుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.
మరోవైపు మాయావతి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు నిజమైతే పంజాబ్‌లో కాంగ్రెస్ ఎలా నెగ్గిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని, ఏ పార్టీకి ఓట్లేసినా ఆ ఓట్లు బీజేపీకే వెళ్లేలా గ్యాంబ్లింగ్ చేశారని శనివారం మీడియాతో మాయావతి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ముస్లింల మెజార్టీ ఓట్లుండే ప్రాంతాల్లోనే బీజేపీకే అధిక సంఖ్యలో ఓట్లు పోలవ్వడంపై ఆమె సందేహాలు వ్యక్తంచేశారు.
విదేశీ నిపుణులతో దీనిపై విచారణ జరపించాలని, ప్రజలకూ యూపీలో వాడిన ఈవీఎంలపై నమ్మకం లేదని వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను కోరుతూ ఆమె లేఖ రాశారు. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ పేపర్‌తో పాత పద్ధతిలోనే ఓటింగ్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అలాగే ఒక్క ముస్లింకు టికెట్ ఇవ్వకున్నా బీజేపీ గెలవడంపై ఆమె పలు అనుమానాలు లేవనెత్తారు. కానీ, ఎన్నికల కమిషన్ మాత్రం ఆమె లేఖను అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో మాయావతికి నిరాశే ఎదురైంది.