ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచింది: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వ్యాఖ్యానించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని ఆమె శనివారమిక్కడ అన్నారు. ఏ గుర్తుకు ఓటేసినా బీజేపీకే వెళ్లిందని మాయావతి ఆరోపించారు. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... ఎన్నికల కమిషన్‌ను అడగాలని సూచించారు. అలాగే ఒక్క ముస్లింకు టికెట్ ఇవ్వకున్నా బీజేపీ గెలుపు ఎలా సాధ్యమైందని ఆమె సూటిగా ప్రశ్నించారు.