
అదే విషయం పార్లమెంట్ లో చెప్పలేరా?
పాత పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. పాత పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం సమావేశమైన వెంటనే పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రధాని మోదీ సభకు రావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో చైర్మన్ ముందు ఆందోళన చేపట్టారు.
పార్లమెంట్ లో తప్ప అనిచోట్ల ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశం లేదని మోదీ చెబుతున్నారని, అదే విషయాన్ని పార్లమెంట్ లో చొప్పొచ్చు కదా అని వ్యాఖ్యానిచారు. నల్లధనం ఎవరి దగ్గర ఉందే చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు.
నల్లధనానికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తప్పుబట్టారు. ’మోదీ వ్యాఖ్యలు చాలా తప్పు. ప్రధాని ఇలాంటి ఆరోపణలు ఎలా చేయగలుతున్నారు. మోదీ క్షమాపణలు చెప్పాల’ని ఆజాద్ మండిపడ్డారు. జేడీ(యూ), సమాజ్ వాదీ పార్టీ నాయకులు కూడా.. మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు కార్యకలాపాలు స్తంభింపజేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.