పెదవి విప్పనున్న ప్రధాని మోదీ!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మళ్లీ అమీ-తుమీకి అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. బుధవారం నుంచి పునఃప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాలను ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నోట్ల రద్దుపై ప్రతిపక్షాల ఆందోళనలతో గతకొన్నిరోజులుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగని విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరుకావాలని విప్ జారీ చేసింది. నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకు వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం అంశాన్ని అధికారపక్షం తెరపైకి తెచ్చే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సహా పలువురిపై ఆరోపణలు రావడం కాంగ్రెస్‌ను ఇరకాటంలో నెట్టుతోంది.
మరోవైపు బీజేపీ కూడా తన ఎంపీలకు విప్ జారీచేసింది. రాజ్యసభలోనూ, లోక్‌సభలో ఫుల్‌బెంచ్ హాజరుకావాలని స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ప్రధాని మోదీ బుధవారం ఉదయం కీలక మంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశముంది. అంతేకాకుండా తొలిసారి ప్రధాని మోదీ నోట్లరద్దుపై పార్లమెంటులో మాట్లాడే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రానున్న మూడురోజులు ప్రధాని మోదీ పార్లమెంటుకు హాజరుకానున్నారని, సభలో జరిగే చర్చలో ఆయన పాల్గొంటారని అధికారపక్షం ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మోదీ పార్లమెంటులో మాట్లాడే అవకాశముందని చెప్తున్నారు.