
ముఖ్యమంత్రిపై విచారణా.. ఒప్పుకోలేం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను 2007 నాటి గోరఖ్‌పూర్ అల్లర్ల కేసులో విచారించేందుకు తాము అంగీకరించలేమని యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను 2007 నాటి గోరఖ్‌పూర్ అల్లర్ల కేసులో విచారించేందుకు తాము అంగీకరించలేమని యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ తీసుకున్నారు. అంతకుముందు ఈ కేసులో ఫోరెన్సిక్ విచారణ కోసం పంపిన ఆడియో క్లిప్‌లను మార్చినట్లు తెలియడంతో ఆయన ఈ విధంగా నిర్ణయించారు.
కాగా ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సవరణ దరఖాస్తు దాఖలు చేయడానికి పిటిషనర్‌కు 10 రోజుల సమయం ఇచ్చింది. విచారణకు అనుమతి నిరాకరణను వేరే ఎవరైనా సవాలు చేయడానికి వీలుగా ఈ దరఖాస్తు చేయాలని చెప్పింది. కేసు తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. 2007లో యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని, దానివల్లే గోరఖ్‌పూర్‌లో అల్లర్లు జరిగాయని పిటిషనర్ వాదించారు. అప్పట్లో ఆ కేసులో యోగిని నిందితుడిగా పేర్కొని జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత కేసు యూపీ సీఐడీ విభాగం చేతికి వెళ్లింది. 2015లోనే యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే అప్పటికి అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కూడా ఆయన విచారణకు అనుమతి ఇవ్వలేదు.