లిస్టు ఇస్తేనే అసెంబ్లీ టికెట్లు!
వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిబద్ధత కలిగిన కార్యకర్తల జాబితా ఇవ్వని నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేది లేదని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ హెచ్చరించారు. 2017 సంవత్సరంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలకు లేఖలు రాశారు. ఈ లేఖలను యూపీసీసీ ఒకటి రెండు రోజుల్లో నేతలకు పంపనుంది. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పట్ల నిబద్ధత కలిగిన 20 మంది కార్యకర్తల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. అలా జాబితా ఇవ్వనివాళ్లకు ఎట్టిపరిస్థితుల్లో టికెట్లు ఇచ్చేది లేదని ప్రశాంత కిషోర్ స్పష్టం చేశారు. ప్రతి బూత్ వారీగా కార్యకర్తల జాబితాలు కావాల్సిందేనని వారణాసిలో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పారు. ఎన్నికలకు తగిన వాతావరణాన్ని సిద్ధం చేస్తానని, అయితే అందుకు యూపీ కాంగ్రెస్ నేతల నుంచి సహకారం కావాలని ఆయన అన్నారు.
లిస్టు ఇవ్వకుండా టికెట్ కావాలంటే కుదరదని, రాహుల్ వద్దకు వెళ్లినా ఆయన కూడా కార్యకర్తల బలం లేకుండా నెగ్గలేమన్న విషయాన్ని అంగీకరిస్తారని తెలిపారు. పార్టీ బలంగా ఉన్నచోటల్లా నేతలు ర్యాలీలు చేయాలని.. అయితే ఏ నియోజకవర్గం కూడా బలమైనది, బలహీనమైనదని చెప్పలేమని అన్నారు. గుజరాత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినా, పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. యూపీ మహిళా కాంగ్రెస్ నేతలు కూడా నియోజకవర్గాల వారీగా కార్యకర్తల జాబితా ఇవ్వడం లేదని ప్రశాంత కిషోర్ మండిపడ్డారు. దళితుల ఓటుబ్యాంకు బీఎస్పీకి ఉందని భయపడాల్సిన అవసరం లేదని, అదే ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్లు వచ్చి, బీఎస్పీకి ఒక్కటీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతి పార్టీలోనూ విభేదాలు ఉంటాయని.. అలాగే కాంగ్రెస్‌లో కూడా ఉన్నాయని, దానిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.