పార్లమెంట్‌కు సమయం ‘కరువు’
న్యూఢిల్లీ: దేశంలోని 25 శాతం జనాభా, అంటే దాదాపు 33 కోట్ల మంది ప్రజలు కరువు కాటకాల్లో చిక్కుకొని అల్లాడిపోతుంటే కనీసం వారి గురించి పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలకు వీలు చిక్కడం లేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు బైరాన్ ప్రసాద్ మిశ్రా తన రాష్ట్రంలోని కరువు పీడిత రైతులకు అందే ఆర్థిక సహాయం గురించి ప్రస్తావించేందుకు సోమవారం నాడు లోక్‌సభ అనుమతిని కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 గంటలపాటు లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఇందులో మిశ్రా లేవనెత్తిన అంశం గురించి చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలెవరూ కూడా ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. ఒక్క నిమిషం కూడా కేటాయించలేదు.
ఒక్క తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనే 300 మందికిపైగా వేసవి తాపాన్ని తట్టుకోలేక అసువులు బాసినా పార్లమెంట్‌లో అధికారపక్షానికి ఏ మాత్రం పట్టడం లేదు. వారి దష్టిలో ఇంకెంత మంది మరణిస్తే కదలిక మొదలవుతుందో వారికే తెలియాలి. సోమవారం నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం, శ్రీనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిస్థితి గురించి మాత్రమే వాడిగా వేడిగా చర్చోపచర్చలు సాగిస్తున్నారు. మధ్యలో ఏదో సిక్కుల గురుద్వార్ సవరణ బిల్లును ఆమోదించేందుకు కొంత చర్చ జరిపారు. దేశం ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంటే సభా కార్యక్రమాల ఎజెండాలో చర్చనీయాంశంగా కరువును చేర్చక పోవడమే పెద్ద ఆశ్చర్యం. దీన్ని బట్టి ఈ అంశం పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఏదో బుధవారం నాడు కరవు పరిస్థితులపై ప్రతిపక్ష పార్టీలు, అదీ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీయడంతో కనాకష్టంగా మూడున్నర గంటలపాటు చర్చ జరిగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు రాకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన కరువు నివారణ చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ పెద్దలు పిలుపునిచ్చి తమవంతు పనై పోయిందనిపించారు. రెండో విడత బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలు ఇప్పటివరకు 19 గంటలు కొనసాగగా మూడున్నర గంటలపాటే కరువుపై చర్చ జరిగింది. లోక్‌సభ కార్యకలాపాలు 11 గంటలు కొనసాగినా అసలు కరువు ప్రస్థావనే లేదు. వాస్తవానికి ప్రస్తుతమున్న కరువు తీవ్రతనుబట్టి పార్లమెంట్ సభా కార్యకలాపాలన్నింటిని తాత్కాలికంగా రద్దుచేసి కేవలం ఒకే ఒక్క అంశం కరువుపై చర్చ జరగాలి.
పార్లమెంట్ సంగతి పక్కన పెడితే కేంద్రం కరువు పరిస్థితుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే దేశంలో 256 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడం తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదు.