ఎట్టకేలకు జాట్ల ఆందోళన ముగిసింది. హరియాణాలో వాతావరణం చల్లబడింది. రిజర్వేషన్లకోసం జాట్లు చేపట్టిన ఆందోళనలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్బంధం తొలగింది. నాలుగు రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఢిల్లీ అంబాలా నేషనల్ హైవే ను మంగళవారం సాయంత్రంనుంచీ తెరిచారు. నిరసనకారులు ఆందోళన విరమించడంతో రైలు రోడ్డు మార్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ కు అంతరాయం తొలగినట్లు అధికారులు వెల్లడించారు.
అంబాల ఢిల్లీ మార్గాల్లో రైల్వే ట్రాక్ ల తనిఖీలు, మరమ్మత్తులు నిర్వహించామని రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ అంబాల ఛండీగర్ మార్గాల్లో రైలు సర్వీసులను బుధవారం సాయంత్రంనుంచీ యధావిధిగా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళనలో దెబ్బతిన్న ట్రాక్ లపై అడ్డంకులు తొలగించి, మరమ్మత్తులు నిర్వహించామని చెప్పారు. ఢిల్లీనుంచి మొదలయ్యే అన్ని మార్గాల్లో భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టామని రైల్వే అధికారులు చెప్తున్నారు. హిసార్ నుంచి ఢిల్లీ సహా భివాని, రెవారి, జైపూర్, సదుల్ పూర్, గంగానగర్లకు రైళ్ళను పునరుద్ధరిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే హిసార్ నుంచి చండీగర్, ఢిల్లీ, రోటాక్ లకు బస్ సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు హర్యానా రోడ్ వేస్ హిసార్ జనరల్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు.
బుధవారం నుంచి హరియాణాలో పూర్తిశాతం కర్ఫ్యూ ను ఎత్తివేశారు. రోటాక్ నరంలో పరిస్థితి ప్రశాతంగా మారింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా మంగళవారం సాయంత్రం రోటాక్ లో పర్యటించి స్థానికుల సమస్యలను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు, షాప్ కీపర్లకు జరిగిన భారీ నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై నగరంలో నివాసాలపై ఎక్కడైనా నల్లజెండాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్య, ఉద్యోగాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలంటూ ఫిబ్రవరి 14న హరియాణాలో మొదలైన జాట్ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరి సుమారు 200 మందిదాకా గాయపడగా... 19 మంది ప్రాణాలను కూడ పోగొట్టుకున్నారు. ఆందోళనలపై స్పందించిన కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ.. లిఖిత పూర్వక హామీని కోరుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. చివరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటికి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం హరియాణా ముఖ్యమంత్రి ఖత్తర్ సహా ఇద్దరు హౌస్ సభ్యులను పిలిపించి చర్చలు జరిపిన అనంతరం హరియాణాలో పూర్తిశాతం అల్లర్లు చల్లబడి, వాతావరణం సాధారణ స్థాయికి చేరింది.