‘సిద్ధూ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈస్టిండియా కంపెనీలా వ్యవహరిస్తోందని ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆప్ బహిష్కృత ఎంపీ ధర్మవీర గాంధీ సమర్థించారు. కేజ్రీవాల్, ఆయన బృందం పనితీరును ఈస్టిండియా కంపెనీతో పోల్చడంలో ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్ రాజకీయాలను శాసించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యహరిస్తున్నారని, స్థానిక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కేజ్రీవాల్ గురించి సిద్ధూ చెప్పినదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ధర్మవీర అన్నారు. పంజాబ్ రాష్టాన్ని పంజాబ్ కు చెందిన వారే పాలించాలని, బయటి వ్యక్తులను పాలకులుగా అంగీకరించబోమన్నారు. ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీలో చేరతారా అని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు.