ఈ బడ్జెట్తో తమకు ఒరిగిందేమీ లేదని కొన్ని రైతు సంఘాల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మాకున్న అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విఫలమయ్యారని మహారాష్ట్రలోని విదర్భ రైతులు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని, పెట్టుబడుల్లోని 50శాతం నిధులను వెనక్కి ఇస్తామని చెప్పి ఆ విషయాన్నే మరిచారని విదర్భా జన్ ఆందోళన సమితీ అధ్యక్షుడు కిశోర్ తివారీ అన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులను విస్మరించారని స్వాభిమాని షేట్కరీ సంఘటన అధ్యక్షుడు, ఎంపీ రాజు షెట్టి విమర్శించారు. ' అచ్చే దిన్ (మంచి రోజులు) వస్తాయని అన్నారుగా.. ఇవేనా మంచి రోజులు... ఇది పూర్తిగా నిరాశ పెట్టిన బడ్జెట్' అని ఆయన అన్నారు. తమ ప్రాంతంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.