ప్రగతిభవన్‌లో వ్యవసాయరంగంపై నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్
రైతులు పండించే ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించేలా విధానం ఉండాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పలు వ్యవసాయ ఉత్పత్తులకు అసలు మద్దతు ధరే లేదని, దీనిని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. వరి, మొక్కజొన్నలకు రూ.2 వేలు మద్దతు ధర కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం వ్యవసాయ రంగంపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో నిధుల కొరత లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
‘మద్దతు’పై హరీశ్ నేతృత్వంలో బృందం
రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. పంటలకు మద్దతు ధరపై అనిశ్చితి నెలకొందని.. అంతర్జాతీయ మార్కెట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. కొన్ని ప్రభుత్వ సంస్థలు పంటలను కొనుగోలు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ‘‘ఈ పరిస్థితిని నివారించేందుకు వ్యూహం రూపొందించాలి. ప్రభుత్వమే నేరుగా రైతు సమన్వయ సమితులతో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి.. తిరిగి అమ్మాలి. ఇలా చేయడం వల్ల నష్టం వస్తే ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంటకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో పంటలకు మద్దతు ధర విషయంలో ఎలాంటి విధానం పాటిస్తున్నారో అధ్యయనం చేయాలి. మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో అధికారుల బృందం దేశవ్యాప్తంగా మద్దతు ధరలపై విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వరి, మొక్కజొన్న, పప్పుల వంటివి మాత్రమేగాక పసుపు, మిర్చి, పత్తిలాంటి వాణిజ్య పంటలకు, మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పండ్లకు కూడా మంచి ధర రావాలన్నది లక్ష్యం. అందుకనుగుణంగానే ప్రభుత్వ విధానం ఉంటుంది..’’అని సీఎం తెలిపారు.
మేలోనే రూ.4 వేల సాయం
రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం (ఐఎస్‌ఎస్) ఈ ఏడాది నుంచే అమలవుతుందని.. మే 15 నాటికి మొదటి విడత ఎకరానికి రూ.4 వేల చొప్పున అందిస్తామని సీఎం తెలిపారు. వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ఎలా అమలు చేయాలి, రైతులకు డబ్బులు నేరుగా అందించాలా, బ్యాంకుల ద్వారా అందివ్వాలా, సాగుచేస్తున్న భూములను గుర్తించడం ఎలా, ఏ ప్రాతిపదికన పెట్టుబడి అందించాలి, తదితర అంశాలను అధ్యయనం చేయడానికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. అందులో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
భూరికార్డుల ప్రక్షాళన పూర్తి
భూరికార్డుల ప్రక్షాళన మొదటి దశ పూర్తయిందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో 71,75,096 వ్యవసాయ ఖాతాలు.. 1,42,12,826.17 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నట్లు లెక్క తేలిందని చెప్పారు. ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన డైరెక్టర్ వాకాటి కరుణ, రెవెన్యూ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర సిబ్బందిని అభినందించారు. వీలైనంత త్వరగా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు. భూముల మ్యుటేషన్ అధికారాన్ని ఎమ్మార్వోలకే అప్పగిస్తున్నామని.. ఇక ఆర్డీవోల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.
క్రాప్ కాలనీలపై అవగాహన కల్పిస్తాం
రాష్ట్రంలో ప్రజలు వినియోగించే ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయిస్తున్నామని.. తదనుగుణంగా క్రాప్ కాలనీలను నిర్ధారించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. రైతులు మంచి మార్కెట్ ఉన్న పంటలను, నాణ్యమైన రకాలను సాగు చేయాలని సూచించారు. కల్తీ విత్తనాలను అరికట్టడంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. విత్తనాల తయారీ దారులు, అమ్మకం దారుల వివరాలు, ఫోటోలను ముందే సేకరించి పెట్టుకోవాలని... ఎక్కడ ఏ పొరపాటు జరిగినా వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. మార్కెటింగ్ శాఖ చేపట్టిన కొత్త గోదాముల నిర్మాణంతో 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని, అన్ని గోదాములు కలుపుకొని రాష్ట్రంలో 53 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సమకూరుతుందని సీఎం చెప్పారు. ఆ గోదాములను ఎరువులు, విత్తనాల నిల్వ కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. పంటలకు చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని ఏ ఎకరంలో ఏ పంట వేశారన్న లెక్కలు వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని స్పష్టం చేశారు.
అధికారులకు ప్రశంసలు
రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించే విషయంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్థసారథి నాయకత్వంలోని అధికారులు విశేష కృషి చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. పాలమూరు, కాళేశ్వరం సహా ప్రాజెక్టుల పనులను శరవేగంగా చేస్తున్న మంత్రి హరీష్ రావు, అధికారులను సీఎం ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అత్యుత్తమ సేవలందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐపి అవార్డు అందుకున్న జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment