ఆ సీఎంకు మరో ఎదురుదెబ్బ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. గతంలో డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్రం ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ పరిధిలోని పాటియాలా హౌస్ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వ్యవహారంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సహా ఐదుగురు ఆప్ నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేజ్రీవాల్ సహా కుమార్ విశ్వాస్, ఆశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దీపక్ బాజ్‌పేయి నేతలపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారు. శనివారం ఈ కేసును విచారించిన పాటియాలా హౌస్ కోర్టు తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను, నలుగురు ఆప్ నేతలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
డీడీసీఏ కుంభకోణం వ్యవహారంపై అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ సహా మరికొందరు ఆప్ నేతలు బహిరంగ క్షమాపణ కోరాలని బీజేపీ సూచించినా వారు పట్టించుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ నివేదికలోనూ అరుణ్ జైట్లీ పేరులేకపోవడంతో కేసు మరింట జఠిలమైంది. కేజ్రీవాల్ కష్టాలు రెట్టింపయ్యాయి. జైట్లీపై కేసులను వెనక్కి తీసుకుని, విచారణను ఆపేయాలని.. క్షమాపణ చెప్పాలన్న జైట్లీ, బీజేపీ డిమాండ్లపై కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు.
అరుణ్ జైట్లీ డీడీసీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం ఆధునీకరణ పనులలో భాగంగా నిధుల దుర్వినియోగం జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేయడంతో పాటు త్రిసభ్య కమిషన్‌తో విచారణ చేయించి కేంద్రం చేతిలో భంగపాటుకు గురయ్యారు.