‘పీకే కథ నాదే.. రూ.కోటి ఇప్పించండి!’
న్యూఢిల్లీ: ఆమీర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలోని కథ, సన్నివేశాలు తనవేనని, తన హిందీ నవల ‘ఫరిస్తా’ నుంచి వాటిని కాపీ కొట్టారంటూ కపిల్ ఇసాపురి అనే రచయిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా నిర్మాత విధువినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత జోషీలు తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు. తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపునివ్వడంతో పాటు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని తెలిపారు.