ట్రైన్ టిక్కెట్ మీ ఇంటికే...
న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక రైలు టిక్కెట్ మీ ఇంటి వద్దకే అందించే సౌలభ్యాన్ని రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) విధానం ద్వారా మీ ఇంటి వద్దే డబ్బు చెల్లించి టిక్కెట్ పొందవచ్చు. ఇప్పటివరకూ ఆన్లైన్లో ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు వెంటనే నగదు చెల్లించే విధానం అమల్లో ఉంది. ప్రయాణికులు క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల మోసాలు ఎక్కువ కావటంతో ప్రయాణికులు ఆ కార్డులను ఉపయోగించుకునేందుకు ఇష్టపడటం లేనందున ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముందుగా 200 నగరాల్లో క్యాష్ ఆన్ డెలివరీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు అయిదు రోజులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
అయితే టిక్కెట్ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో స్లీపర్ క్లాస్కు రూ.40, ఏసీ క్లాస్కు రూ.60 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా టిక్కెట్ల కోసం బుకింగ్ కౌంటర్ల దగ్గర పడిగాపులు కాచే ప్రయాణికులకు ఇది శుభవార్తే. అదనంగా డబ్బు చెల్లించినా... టిక్కెట్ల తిప్పులు తప్పినట్లే.