హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు
* పోలవరం ఆర్డినెన్స్ వివాదాస్పదమేమీ కాదు
* గత ప్రభుత్వ హామీనే అమలుచేశాం
* కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఎన్టీయార్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు వెల్లడించారు. ప్రస్తుత డిమాండ్‌ను పరిశీలిస్తామని, అవకాశం ఉంటే మార్చేస్తామని చెప్పారు. ఆయన గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం, మళ్లీ సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
ఆయనేమన్నారంటే...
బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరు, దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుండేది. టీడీపీ హయాంలో శంషాబాద్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుచేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టింది. పేరు మార్చాలని మహానాడులో డిమాండ్ వచ్చింది. డిమాండ్‌ను పరిశీలించి, అవకాశం ఉంటే మార్చేస్తాం.
పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో వివాదమేమీ లేదు. కొత్త విషయం అంతకన్నా లేదు. పోల వరం స్వాతంత్య్రంనాటి నుంచి పెండింగ్‌లో ఉంది.
ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతామని గత ప్రభుత్వం పార్లమెంట్‌లో హామీ ఇచ్చింది. బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆపేసి ఉండొచ్చు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. దీన్ని కొందరు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు కాబోయే(డిజిగ్నేటెడ్) ముఖ్యమంత్రులను పిలిచి చర్చ పెట్టాలంటే.. అపాయింటెడ్ డేను పోస్ట్‌పోన్ చేయాలి. కానీ అందుకు ప్రజలు ఇష్టపడకపోవచ్చు.