పంతం నెగ్గించుకున్న పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళ భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా కె. పాండ్యరాజన్ ప్రమాణం చేశారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పన్నీర్ సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేతులు కలిపారు. అయితే పన్నీర్ వర్గానికి మూడు మంత్రి పదవులు ఇస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
కాగా, ప్రభుత్వం, పార్టీలో పదవులు అందుకోవడం ద్వారా పన్నీర్ సెల్వం పంతం నెగ్గినట్టైంది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదు. పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం చెప్పారు. చిన్నమ్మ భవితవ్యంపై పార్టీ ఎటువంటి వైఖరి అవలంభిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.