ఉమ్మడి నిరసన పదర్శనల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు
సాక్షి, భువనేశ్వర్ : కరోనా వైరస్ నివారణ కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలు శుక్రవారం ఉమ్మడిగా నిరసన ప్రదర్శించాయి. స్థానిక మాస్టరు క్యాంటీన్ ఛక్ ప్రాంతంలో ఈ నిరసన చేపట్టారు. లాక్‌డౌన్ పట్ల శ్రద్ధ వహించి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడంతో కరోనా విజృంభించిందని పలు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. జాతీయ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, సీపీఐఎంఎల్ రెడ్ స్టార్, సమాజ్‌వాది, ఆమ్ ఆద్మీ పార్టీలు, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌జేడీ, కళింగ సేన, ఎన్‌సీపీ, బీఎస్‌పీ, సమృద్ధ ఒడిశా పక్షాలు ఉమ్మడి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. ( ఇదీ! సీఎం నవీన్ పట్నాయక్ అంటే)
గవర్నర్‌కు వినతి పత్రం అందజేత
కరోనా కార్యకలాపాలను పురస్కరించుకుని ఒడిశా మెడిసిన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణాలకు పాల్పడింది. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాలని 13 రాజకీయ పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్‌కు ఈ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. 17 ప్రధాన డిమాండ్లతో గవర్నరుకు వినతిపత్రం ప్రదానం చేశారు. ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు రూ. 7, 500 చొప్పున 6 నెలలపాటు ఆర్థిక సహాయం అందజేయాలి.
ఈ కుటుంబాలకు 6 నెలల వరకు ప్రతి నెల 10 కిలోగ్రాముల బియ్యం, 5 కిలోల పప్పు సరఫరా చేయాలి. రబీ సీజన్ వ్యవసాయ ఉత్పాదనల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి ఖరీఫ్ సీజన్ సాగుకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, 60 నరేగా పని దినాలు మంజూరు చేయాలని గవర్నర్‌ను వినతిపత్రంలో అభ్యర్థించారు. తోపుడు బండ్ల వ్యాపారులు, కళాకారులు వంటి బాధిత వర్గాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించి మూతబడిన నూలు మిల్లుల ఇతరేతర సంస్థల్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment