ఆలయంలో విగ్రహాలను తొలగిస్తున్న దృశ్యం
భువనేశ్వర్ : ఒడిశాలో ఓ పురాతన ఆలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాంప్రదాయాలను పక్కకు పెట్టి తొలిసారి మగవాళ్లను గుళ్లోకి అనుమతించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏనాడూ పురుషులు గర్భగుడిలో అడుగుపెట్టింది లేదు. అలాంటిది ఈ ఘటన చోటుచేసుకోవటంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.
వివరాల్లోకి వెళ్తే... కేంద్రపారా జిల్లాలో సతాభ్యా అనే లంక గ్రామంలో పంచువారాహి అమ్మవారి ఆలయం ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో మగవాళ్లకు అనుమతి లేదు. ఐదుగురు దళిత మహిళలు(వివాహితులై ఉండాలి) మాత్రం నిత్యం ఆలయ శుద్ధి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదిలా ఉంటే బంగాళా ఖాతంలో నీటి మట్టం పెరిగిపోతుండటం.. దాని ఒడ్డున్న ఉన్న గ్రామాలకు(అందులో సతాభ్యా కూడా ఉంది) ముంపు ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం గ్రామాల తరలింపు కార్యక్రమం చేపట్టింది. ఒడిశా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ-ప్రపంచ బ్యాంకులు సంయుక్తంగా ఓడీఆర్‌పీ పేరిట ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా సతాభ్యా గ్రామాన్ని బాగాపాటియా ప్రాంతానికి తరలించారు. అయితే ఇంతకాలం తమను రక్షిస్తూ వస్తున్న అమ్మవారిని వదిలేయటానికి వాళ్లు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించేందుకు నిర్ణయించారు.
విగ్రహాల తరలింపు... సతాభ్యా నుంచి బాగాపాటియా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అధికారుల సాయంతో గ్రామస్థులు కొత్త ఆలయం నిర్మించుకున్నారు. అయితే విగ్రహాల తరలింపు ఆ మహిళా పూజారులకు కష్టతరంగా మారింది. ఐదు భారీ రాతి విగ్రహాలు ఒక్కోక్కటి టన్నున్నర బరువు ఉన్నాయి. దీంతో వాళ్లు పురుషుల సాయం తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఐదుగురు వ్యక్తుల సాయంతో విగ్రహాలను తొలగించి.. పడవ ప్రయాణం ద్వారా కొత్త ఆలయానికి తరలించారు. ఆపై వాటికి శుద్ధి కార్యక్రమం నిర్వహించి.. తిరిగి పూజలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment