
మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు
న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో ఏర్పడ్డ నగదు సంక్షోభం నేపథ్యంలో పాతనోట్ల వినియోగంపై ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు సడలించింది. పౌర సేవల బిల్లులు చెల్లించేందుకు, పెట్రోల్ బంకుల్లో, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు నవంబర్ 24 వరకూ రూ.500, రూ.వెయ్యి నోట్లను వినియోగించవచ్చని పేర్కొంది. పౌరసేవల బిల్లులతో పాటు ఇతర పన్నులు, ఫీజులు పాత నోట్లతో చెల్లించవచ్చని వెల్లడించింది.
నవంబర్ 8న నోట్ల రద్దుపై మోదీ ప్రకటన అనంతరం...ప్రభుత్వ ఆస్పత్రులు, పెట్రోలు బంకులతో పాటు రైల్వే, విమాన టిక్కెట్ల కొనుగోలుకు, ప్రజా రవాణా కోసం, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో రూ. 500, రూ.వెయ్యి నోట్లు వాడుకోవచ్చని కేంద్రం సడలింపు నిచ్చింది. అనంతరం ఈ గడువును నవంబర్ 14 వరకూ పొడిగించారు. పాత నోట్ల రద్దుతో ఏర్పడ్డ గందరగోళం కొనసాగుతుండడంతో గడువును నవంబర్ 24 వరకూ పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పాత బిల్లుల చెల్లింపునకే ఈ నిబంధనలు వర్తిస్తాయమని ముందస్తు చెల్లింపు చేయకూడదని కేంద్రం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏటీఎం లావాదేవీల చార్జీల్ని ఎత్తేసిన బ్యాంకులు
నవంబర్ 21 వరకూ ఎయిర్‌పోర్టుల్లో పార్కింగ్ ఫీజు రద్దు చేస్తూ ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం
జాతీయ రహదారులపై టోల్ చార్జీల వసూలు రద్దును నవంబర్ 18 అర్థరాత్రి వరకూ పొడిగించారు. కొత్త నోట్లు, చిల్లర కొరత నేపథ్యంలో జాతీయ రహదారులపై ట్రాఫిక్ జాంలు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు సంబంధిత యంత్రాంగాలకు ఆదేశాలు జారీచేశారు.
కేంద్రీయ భండార్ వంటి సహకార కేంద్రాలతో పాటు, కోర్టు ఫీజులు చెల్లించేందుకు కూడా గుర్తింపు కార్డుతో పాత నోట్లు వినియోగించుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా ఉన్న 1.3 లక్షల పోస్టాఫీసుల్లో నగదు నిల్వల్ని పెంచుతామని కేంద్ర ఆర్థి వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ సోమవారం తెలిపారు. దేశ వ్యాప్తంగా కొత్త నోట్ల విత్ డ్రా కోసం వందల కొద్దీ మైక్రో నగదు ఏటీఎంల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు సరిపడా నగదు అందుబాటులో ఉంచామని, బ్యాంకులకు వర్తించే నిబంధనలే డీసీసీబీలకు వర్తిస్తాయన్నారు.
కరెంట్ బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితి రూ. 50 వేలకు పెంపు. అయితే ఖాతా తెరచి మూడు నెలలు కావాలి. మరో రెండు రోజుల్లో మార్పులు చేసిన ఏటీఎంల నుంచి రూ. 2 వేల నోట్లు లభ్యం. ప్రస్తుతం మార్పులు చేసిన ఏటీఎంల నుంచి రూ. 2500 విత్ డ్రాకు అవకాశం కల్పిస్తున్నారు. రూ.2 వేల వరకూ చిన్న నోట్లతో పాటు రూ. 500ల కొత్త నోటు వస్తుండగా... మార్పులు చేయని ఏటీఎంల నుంచి రూ. 2000ల మేర చిన్న నోట్లే వస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే బ్యాంకింగ్ కరస్పాండెట్లు వద్ద నగదు నిల్వను రూ. 50 వేలకు కేంద్రం పెంచింది. రోజుకు ఎన్నిసార్లైన బ్యాంకుల నుంచి వారు నగదు పొందేందుకు అవకాశం కల్పించింది.