
విమానంలో మహిళపై లైంగిక వేధింపులు!
కోల్కతా: ఓ మహిళను సహ ప్రయాణికుడు లైంగికంగా వేధించిన ఘటన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. కోల్కతా- న్యూఢిల్లీ విమానంలో సహ ప్రయాణికుడు తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి.. కేసు నమోదు చేశారు.
50 ఏళ్ల నిందితుడు సంజయ్ కనద్, బాధితురాలు ఇద్దరూ ఢిల్లీ వాసులే. వారు సోమవారం ఉదయం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి వచ్చి.. ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో కూచున్నారు. ఇద్దరు సీటు బెల్టులు పెట్టుకున్న అనంతరం మహిళ కేకలు వేసింది. తన పక్కన కూర్చున్న సంజయ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో ఇద్దరిని విమానాశ్రయంలోనే దింపేసి షెడ్యూల్ ప్రకారం విమానం వెళ్లిపోయింది. అనంతరం బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్ సిబ్బంది.. సంజయ్ కనద్ను అరెస్టు చేశారు.