కశ్మీర్ చల్లారేదెప్పుడు!? | One month on, Kashmir remains caught between curfew and shutdown | Sakshi
Sakshi News home page

కశ్మీర్ చల్లారేదెప్పుడు!?

Published Mon, Aug 8 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

కశ్మీర్ చల్లారేదెప్పుడు!?

కశ్మీర్ చల్లారేదెప్పుడు!?

* నెలరోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, కర్ఫ్యూ
* తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు; సత్వర పరిష్కారం తక్షణావసరం

సాక్షి, సెంట్రల్ డెస్క్: భూతల స్వర్గం నెత్తురోడుతోంది. అందాల లోయ అట్టుడుకుతోంది. హిమ శిఖరాల కశ్మీరం కర్ఫ్యూ నీడన బిక్కుబిక్కుమంటోంది. ఉగ్ర సంస్థ ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్‌కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత 30 రోజులు గడచినా.. నేటికీ కొనసాగుతోంది. ఇదే అదనుగా కశ్మీర్‌ను రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు, కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

బుర్హాన్ వానీని అమరుడంటూ బహిరంగంగానే కీర్తిస్తోంది. ప్లెబిసైట్ అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు కశ్మీర్ అనిశ్చితిని వాడుకుంటోంది. కశ్మీరీలు తమవాళ్లేనంటూ, వారికి వైద్య, ఔషధ సాయం అందిస్తామంటూ రాజకీయం చేస్తోంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మొదలైన ఉగ్ర నేతలు కశ్మీర్లో ఉద్రిక్తతను మరింతగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షలాది మంది హాజరైన వానీ అంత్యక్రియలను నిర్వహించింది లష్కరే కమాండరేనని, కశ్మీర్లో తమవాళ్లు ఇప్పటికే విధుల్లో ఉన్నారని సయీద్ నిర్భయంగా ప్రకటించాడు.

మరోవైపు, కశ్మీర్‌పై ప్రధాన పార్టీల నిందారాజకీయాలు కొనసాగుతున్నాయి. కలసికట్టుగా పరిస్థితిని చక్కదిద్దడం, విశ్వాస కల్పన చర్యలు చేపట్టడం మొదలైన కార్యక్రమాలకు బదులుగా.. పరస్పర ఆరోపణలతో కాలం వెల్లబుచ్చుతున్నాయి.
 
52 మంది ప్రాణాలు ఆహుతి
దాదాపు నెలరోజులుగా కర్ఫ్యూ దిగ్బంధంలో ఉన్న కశ్మీర్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆందోళనకారుల రాళ్లదాడులు.. పెల్లెట్ గన్స్‌తో భద్రతా దళాల ఎదురుదాడులు నిత్యకృత్యంగా మారాయి. ఆందోళనలు జరుగుతున్న ప్రతీచోట రహదారులు రాళ్లమయమై కనిపిస్తున్నాయి. గత 29 రోజుల్లో ఈ ఆందోళనల్లో 52 మంది ప్రాణాలు కోల్పోగా, 3500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

వారిలో అత్యధికులు భద్రతాబలగాల గన్స్ నుంచి వెలువడిన పెల్లెట్స్ వల్లనే గాయపడటం గమనార్హం. పెల్లెట్ల తీవ్రతకు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం స్పందించి పెల్లెట్ గన్స్‌కు ప్రత్యామ్నాయాలను సూచించేందుకు కమిటీని వేసింది.
 
సమసిపోతాయనుకున్నారు..!
వాని ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు కొన్ని రోజుల తరువాత సమసి పోతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. అయితే, ఆ అంచనా తప్పయింది. అల్లర్లు రోజురోజుకీ పెరగసాగాయి. అజ్ఞాతంలో ఉన్న కొందరు, గృహనిర్బంధంలో ఉన్న మరికొందరు వేర్పాటువాద నేతలు అల్లర్లు కొనసాగేలా వ్యూహరచన చేస్తున్నారని, అందుకు సీమాంతర ఉగ్రనేతలు సైతం సాయపడ్తున్నారని, వారంతా చావోరేవో తేల్చుకుందామంటూ కశ్మీరీలను రెచ్చగొడ్తున్నారని వార్తలు రాసాగాయి. తాజాగా శనివారం పుల్వామా, అనంత్‌నాగ్, షోపియన్, కుల్గామ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున్న అల్లర్లు జరిగాయి.
 
సామాన్యులే సమిధలు
నిత్యావసరాలు, వైద్య సేవల కోసం సామాన్య కశ్మీరీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపుల్లో నిత్యావసరాలు నిండుకున్న పరిస్థితి, మార్కెట్లకు కూరగాయలు రాలేని పరిస్థితి నెలకొంది. నెలరోజులుగా స్కూళ్లు, కాలేజీలు నడవడం లేదు. అఫీసులు, బ్యాంకులు, పోస్టాఫీసులు అరకొరగా నడుస్తున్నాయి. చిరు వ్యాపారులు ఆదాయం కోల్పోయారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో మళ్లీ శాంతి నెలకొనేందుకు సమగ్ర ప్రణాళిక, అఖిల పక్ష  సంప్రదింపులతో రాజకీయ కార్యాచరణ తక్షణావసరం. పాక్ ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని అన్ని స్థాయిల్లో నిరోధించాలి. కశ్మీరీ యువతలోని కోపాన్ని, అసంతృప్తిని పోగొట్టాలి. రాజకీయాలకు అతీతంగా అందాల కశ్మీర్‌ను శాంతి ధామంగా మార్చేందుకు అన్ని వర్గాలు నడుం కట్టాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement