
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరలు చూసి సామాన్య ప్రజలు భయపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర రూ.70-80కి చేరి సెంచరీ దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకు ముందు కిలోల కొద్ది ఉల్లి కొనే వినియోగదారులు.. ప్రస్తుతం కిలో కొనాలన్న వెనకడుగేస్తున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.50కి మిగించింది. కొన్ని చోట్ల రూ.60కి కూడా పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఉల్లి ధరలు పెరగడానికి వర్షాలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నారని.. అందుకే ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉల్లి ఘాటెక్కడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి నిల్వ చేసిన ప్రాంతాల నుంచి కొరత ఉన్న ప్రాంతాలకు రవాణా చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. మరోవైపు పెరిగిన ఉల్లి ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నష్టపోయాయని ఈసారైన మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
ఆదుకున్న అరవింద్..
అయితే ఉల్లి ధరలు ఆకాశానంటడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశారు. కేజీ ఉల్లిని ప్రభుత్వం తరఫున కేవలం రూ. 25కే చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వాహానాల ద్వారా వీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment