ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా 28 సార్లు ముక్కు ముఖం తెలీనివారికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) షేర్ చేసేసి ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకున్న నవీ ముంబైకి చెందిన అమాయక మహిళ ఉదంతంతో మరోసారి ఆన్‌లైన్ మోసాలపై చర్చ జరుగుతోంది. కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లు బ్యాంకులు ఎప్పుడూ అడగవని అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ బ్యాంకు నుంచే మాట్లాడుతున్నామనే భ్రమ కల్పించేలా తీయతీయగా మాట్లాడుతూ నిండా ముంచేసేవాళ్లకి మోసగాళ్లు ఎప్పుడూ రెచ్చిపోతూనే ఉన్నారు. ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహన లేని వారు వారి మాయలో పడి మోసపోతూ లబోదిబోమంటూనే ఉన్నారు.
నవీ ముంబైలోని నెరూలో నివాసం ఉండే తస్నీమ్ ముజాకర్ మోదక్ అనే మహిళకి బ్యాంకులు, ఆన్‌లైన్ లావాదేవీలన్నీ కొత్త కావడం, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సీవీవీ నెంబర్, వన్‌టైమ్ పాస్‌వర్డ్ కూడా బ్యాంకు మేనేజర్ కదా అనుకొని షేర్ చేయడం చూస్తుంటే , ఇల్లు కదలకుండా ఉండే గృహిణుల అమాయకత్వాన్ని మోసగాళ్లు ఎలా కేష్ చేసుకుంటారో తెలుస్తోంది. మోదక్‌కు మే 17ను బ్యాంకు మేనేజర్‌నని చెప్పుకుంటూ ఎవరో కాల్ చేశారు. సాంకేతిక కారణాల వల్ల మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందని, కార్డుపై వివరాలు చెబితే దానిని ఆక్టివేట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ మాటలు నమ్మిన ఆమె అమాయకంగా కార్డుపై ఉన్న 16 అంకెల కార్డు నెంబర్, పేరు, చివరికి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సీవీవీ నెంబర్ అన్నీ చెప్పేసింది. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వివిధ నెంబర్ల నుంచి వాళ్లు ఫోన్ చేసి మీకు ఓటిపీ వచ్చి ఉంటుంది కదా, ఆ నెంబర్ చెబుతారా అంటే బ్యాంకు వాళ్లే అడుగుతున్నారు కదా ఏం పోయిందిలే అనుకుంటూ వారం రోజుల్లో ఏకంగా 28 సార్లు షేర్ చేసింది.
ఆమె అకౌంట్ నుంచి మొత్తం ఏడు లక్షలు డబ్బులు పోయాక కానీ, ఏం జరిగిందో తెలుసుకోలేకపోయింది. చివరికి మే 29న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై, నోయిడా, గురుగ్రామ్, కోల్‌కతా, బెంగుళూరు నుంచి ఆ మోసగాడు డబ్బుల్ని విత్ డ్రా చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మొత్తం మూడు రకాల సిమ్ కార్డులు వినియోగించి మోదక్‌ని మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడంటే మోదక్ గురించి తెలిసింది కానీ, ఆసియాలోనే భారత్‌లో డిజిటల్ మోసాలు అత్యధికమని ఇటీవల వచ్చిన సర్వేలెన్నో చెబుతున్నాయి.మన దేశంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్న వారిలో 48శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోసానికి గురయినట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వల్ల ఎందరో ఆన్‌లైన్ మోసానికి లోనై అలాంటి లావాదేవీలు జరపాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. లావాదేవీలు నిర్వహించినప్పుడు కచ్చితంగా ప్రతీ ఒక్కరూ భద్రతాపరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం.
- మొబైల్ నోటిఫికేçషన్ అలర్ట్‌లు బ్యాంకు నుంచి వచ్చే సదుపాయాన్ని వినియోగించుకోవాలి. దీని వల్ల మన బ్యాంకు నుంచి జరిగే లావాదేవీలపై ఎప్పటికప్పుడుసమాచారం అందుతుంది. బ్యాంకు స్టేట్‌మెంట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
- డెబిట్ కార్డుపై ఉన్న సీవీవీ నెంబర్‌ను, ఏటీఎం పిన్ నెంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు
- మీ కంప్యూటర్లో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల పీసీ భద్రంగా ఉంటుంది.
- బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా సోషల్ మీడియాలో ఉంచకూడదు
- పబ్లిక్ వైఫై ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
- స్మార్ట్ ఫోన్ వాడేవారు ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అయ్యేలా చూసుకోవాలి.
- ప్రొమోషనల్ ఈ మెయిల్స్ ద్వారా బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లు ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. అసలు వెబ్‌సైట్‌కి వెళ్లి మాత్రమే తెరిచి చూడాలి.
- ఇంటర్నెట్ వాడనప్పుడు వైఫై ని వెంటనే ఆఫ్ చేసేయాలి.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment