నోట్ల రద్దు వరదతో ఒకే చెట్టెక్కిన ప్రతిపక్షాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
చండీగఢ్: నోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడ్డ వరద నుంచి తప్పిం చుకు నేందుకు ప్రతి పక్షాలన్నీ ఒకే చెట్టు ఎక్కికుర్చున్నాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్యంగా విమర్శించారు. వరదల సమయంలో ఎలుకలు, పిల్లులు, పాములు, ముంగిసలు ఒకే చెట్టు ఎక్కినట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని మార్చేందుకు ప్రధాని మోదీకి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.
చండీగఢ్‌లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల్ని ఉద్దేశించి ఆదివారం ప్రసంగిస్తూ... నోట్ల రద్దును రాహుల్ గాంధీ వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగించలేదని, ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలకు పర్యాయపదంగా నిలిచిన సంగతి తెలిసిందేనన్నారు. దేశంలో నల్లధనం కేన్సర్‌లా మారిందని, శస్త్రచికిత్స అనంతరం కొంత నొప్పి భరించక తప్పదని, మిగతా జీవితమంతా ఆనందంగా జీవిస్తారని ఆయన పేర్కొన్నారు.