సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై, అధికార బీఆర్‌ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పారు. పరిస్థితి బీజేపీకి సానుకూలంగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు యావత్ పార్టీ యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ సర్కారే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో ముఖ్యనేతలు ఆధిపత్య పోరుకు, గ్రూపులకు ఆస్కారం ఇవ్వకుండా ఐక్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం ఖమ్మంలో ‘రైతు గోస– బీజేపీ భరోసా’బహిరంగ సభ అనంతరం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, కోర్ కమిటీతో సమావేశమైన అమిత్‌షా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి.
5సీ ప్రాతిపదికగా పనిచేయాలి
బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటే అని సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో పనిగట్టుకుని సాగుతున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఖండిస్తూ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని షా ఆదేశించారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం వద్ద రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఉన్న సమాచారం, వివిధ రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన వివరాలు వెల్లడించారు.
పార్టీ గెలుపు విషయంలో నాయకులు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాలని, పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపాలని సూచించారు. క్లారిటీ, కాన్ఫిడెన్స్, కమిట్‌మెంట్, కోఆర్డినేషన్, క్రెడిబిలిటీ (5 సీ) ప్రాతిపదికగా పనిచేయాలని, ప్రజలకు అన్ని విషయాల్లో స్పష్టత ఇస్తూ నేతలు చిత్తశుద్ధి, సమన్వయంతో పార్టీపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా కృషి చేయాలని చెప్పారు.
అవినీతిని వెలికితీసి ప్రచారం చేయండి
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమిత్‌షా చర్చించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ రెండు పార్టీలతో పాటు మజ్లిస్ రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో సాగాలని సూచించారు. గత తొమ్మిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు సహా వివిధ కార్యక్రమాలు, పథకాల అమల్లో బీఆర్‌ఎస్ సర్కార్ అవినీతికి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని వెలికితీసి వాటిని ప్రజల్లో ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలు, టికెట్ దక్కనివారితో పాటు రెండు పార్టీల అసంతృప్త ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల మేనేజ్‌మెంట్, వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు.
ఎన్నికల సన్నద్ధతపై లోతుగా సమీక్ష
రాబోయే 3, 4 నెలల్లో జరగనున్న అసెంబ్లీ, వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై అమిత్‌షా సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. పార్టీపరంగా పట్టున్న, కచి్చతంగా గెలిచే అవకాశాలున్న ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలెన్ని? వీటితో పాటు బీజేపీ బలా లు కేంద్రీకరించి విజయం కోసం కృషిచేస్తున్న నియోజకవర్గాలు, పార్టీ రెండోస్థానంలో నిలిచే అవకాశాలున్న సీట్లు ఏవేవి అన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం.
ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు.
29, 30 తేదీల్లో సమీక్ష సమావేశాలు
బీజేపీ ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. ఎమ్మెల్యేల ప్రవాస యోజన, అసెంబ్లీ స్థానాల వారీగా బూత్ కమిటీలు, సెపె్టంబర్ 7న చలో హైదరాబాద్, నా మట్టి నా దేశం, బస్సు యాత్ర, ఓటర్ వెరిఫికేషన్, సెపె్టంబర్ 17 తదితర అంశాలపై చర్చించనుంది. పార్టీ ముఖ్య నేతలు సునీల్ బన్సల్ (మెదక్, ఖమ్మం), అరవింద్ మీనన్ (అదిలాబాద్, నిజమాబాద్), తరుణ్ ఛుగ్ (కరీంనగర్, నల్లగొండ), ప్రకాష్ జవదేకర్ (మహబూబ్‌నగర్, వరంగల్), బండి సంజయ్ (ఆదిలాబాద్), డీకే అరుణ (నిజామాబాద్) హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment