విపక్షాల ‘వర్షాకాల’ వ్యూహం
ఏకాభిప్రాయంతో సర్కారుపై కత్తులు నూరుతున్న 18 పార్టీలు
► జీఎస్టీ, నోట్లరద్దు సహా ఐదు అంశాల గుర్తింపు
► పార్లమెంటు లోపలా, బయటా పోరాటానికి నిర్ణయం
► రాజకీయ కుట్రపైనా ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచన
► నేడు విపక్ష నేతలతో రాజ్‌నాథ్, సుష్మ భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు పలు అంశాలపై మోదీ సర్కారును ఇబ్బంది పెట్టాలని వ్యూహం రచిస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మంగళవారం జరిగిన విపక్షాల భేటీలోనే వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఐదు కీలకాంశాలపైనా పార్లమెంటు లోపలా, బయటా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. నోట్లరద్దు దుష్పరిణామాలు, జీఎస్టీ అమలు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, రాజకీయ కుట్ర, సమాఖ్య విధానాన్ని కాపాడటం, మతపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయటం వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించాయి.
విపక్షాలతో రాజ్‌నాథ్, సుష్మ చర్చలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల విమర్శల వేడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి, సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ విషయాలపై పూర్తి వివరాలను విపక్షాలకు తెలపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ శుక్రవారం విపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే విపక్ష నేతలకు ఆహ్వానం అందింది. కశ్మీర్ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకే కేంద్రం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది.
భారత్–భూటాన్–టిబెట్ ట్రై జంక్షన్‌లోని డోక్లామ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించటం, దీన్ని భారత్ తిప్పికొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అటు జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల కాల్పులు, కొంతకాలంగా ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేసిన భద్రతాదళాలు వంటి అంశాలను కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. లోయలో అశాంతి కారణంగా ఐదు నెలల్లో ఇద్దరు పోలీసులు సహా 76 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చైనా, కశ్మీర్ అంశాల్లో కేంద్రం వ్యవహరించిన తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. రాహుల్ భారత్‌లో చైనా రాయబారితో సమావేశమై బహిరంగంగానే మోదీపై విమర్శలు చేయటంతో కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని యోచిస్తోంది.
జట్టుగా ప్రతిపక్షం!
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వంపై నారదా స్కామ్ ఆరోపణలు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాలపై ఈడీ, సీబీఐ దాడులన్నీ రాజకీయ కుట్ర కారణంగానే జరిగాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘మేమంతా ఓ జట్టులా పని చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఒకపార్టీకి, ఒక వ్యక్తికి ప్రాధాన్యం అనే మాటే లేదు. అం దరం సమానమే’ అని తృణమూల్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ తెలిపారు.
నెలకోసారైనా విపక్షాలన్నీ సమావేశమై ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించా లని, పలు రాష్ట్రాల్లో ఒక్కోసారి ఈ సమావేశాలు ఏర్పాటుచేయాలని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. తామంతా ఏకతాటిపై ఉన్నామని తెలిపేందుకే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాల కృష్ణ గాంధీ పేరుపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న తృణమూల్‌కు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం రాగా మిగిలిన పార్టీలు బలపరిచాయి.