‘ఓషివారా'.. పూర్తిచేయరా! | oshiwara railway station in six-lane flyover | Sakshi
Sakshi News home page

‘ఓషివారా'.. పూర్తిచేయరా!

Published Sat, Jul 5 2014 10:53 PM | Last Updated on Tue, Nov 6 2018 4:57 PM

oshiwara railway station in six-lane flyover

- ముందుకు సాగని ఓషివారా రైల్వే స్టేషన్ పనులు
- సమీప ఆరులేన్ల ఫ్లై ఓవర్ పనులదీ అదే దుస్థితి

సాక్షి, ముంబై : సమీప రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే ప్రయత్నంగా నిర్మిస్తున్న ఓషివారా రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వివిధ కారణాల వల్ల ముందుకు సాగడం లేదు. అదేవిధంగా ఈ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ఆరు లేన్ల ఫ్లై ఓవర్ పనులది కూడా అదే దుస్థితి. ఈ ఇరు ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డు వస్తున్న నివాస స్థలాలు అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

ఓషివారాలో కొత్త రైల్వే స్టేషన్ ట్రాకుల వెంబడి ఇరు పక్కల దాదాపు 200 మీటర్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఓషివారా తూర్పులోని శివ్‌శంకర్ నగర్‌లో దాదాపు 135 మీటర్ల స్థలాన్ని నివాసితులు ఆక్రమించుకోగా, ఓషివారా పశ్చిమంలోని రామ్ మందిర్ రోడ్డు వద్ద 80 మీటర్ల స్థలాన్ని తమ వ్యాపార నిమిత్తం వ్యాపారులు ఆక్రమించుకున్నారు.
 
2011లో పూర్తి చేయాలి కానీ..
వెస్టర్న్ లైన్‌లో జోగేశ్వరి, గోరేగావ్ రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే నిమిత్తం ఓషివారా రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని 2011లోనే నిర్మించాలనుకున్నారు. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి గోరేగావ్ తూర్పులోని రాం మందిర్ వరకు అనుసంధానం చేస్తూ 1.3 కి.మీ మేర ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో అంధేరి-గోరేగావ్‌ల మధ్య ఉన్న ఒకే ఒక్క వీర్‌సావర్కర్ ఫ్లై ఓవర్‌పై కొంత మేర రద్దీ తగ్గనుంది. ఎంతో కీలకమైన ఈ ఇరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని రూ.200 కోట్లతో చేపడుతున్నారు. పనుల్లో తీవ్ర కాలయాపన జరుగుతోంది.
 
ఆక్రమణలతోనే ఆలస్యం
ఆక్రమణ దారుల వల్ల ఈ బ్రిడ్జి పనులు ముందుకు సాగడం లేదని, సాధ్యమైనంత త్వరలో దీనిని పూర్తి చేసి ప్రారంభిస్తామని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి చెందిన చీఫ్ ఇంజనీర్ (బ్రిడ్జిలు) ఎస్.ఓ.కోరి తెలిపారు. ఈ ఇరు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డు వస్తున్న నివాస స్థలాలను తొలగించిన తర్వాతనే ఈ ప్రాజెక్టులు పూర్తి అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీరికి పునరావాసం కల్పిస్తామని ఆఫర్ చేసినప్పటికీ నిరాకరిస్తున్నారని  పేర్కొన్నారు.

ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం లక్షలాది ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. కానీ చిక్కుల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయోననీ స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఈ ఆక్రమణ దారులతో  లక్షలాది సబర్బన్ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,  కార్పొరేషన్ వీరికి పునరావాసం కల్పించాలని అప్పుడే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని రవాణా నిపుణులు రిషి అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
 
నష్టపరిహారంగా బీఎంసీ స్థలాలు కేటాయించాలి
ఈ విషయమై రాంమందిర్ రోడ్ ఓవర్ బ్రిడ్జి పాప్స్ అసోసియేషన్ కార్యదర్శి జుబెర్ దావా మాట్లాడుతూ.. ఇరు ప్రాజెక్టుల కారణంగా ఇళ్లు కోల్పోయే వారికి ఇదే ప్రాంతంలో నష్టపరిహారంగా బీఎంసీ స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇలా కాకుండా కార్పొరేషన్ అధికారులు వారిని చెంబూర్ ఇతర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరుతున్నారని, అది సరైందికాదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement