
మా పనిమనిషిని హింసించారు!
- నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెట్టారు
- ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు గత నవంబర్లో శశథరూర్ లేఖ
- సునంద పుష్కర్ హత్య కేసు దర్యాప్తు ప్రారంభించిన సిట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతికి సంబంధించి కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. సునంద హత్య కేసు విచారణ సందర్భంగా తన ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ థరూర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి గత సంవత్సరం నవంబర్ 12న రాసిన లేఖ ఒకటి బుధవారం మీడియాకు లభించింది.
విచారణ సమయంలో పోలీసు అధికారుల్లో ఒకరు నారాయణ్ సింగ్‌ను శారీరకంగా హింసించి, భయపెట్టి సునంద పుష్కర్‌ను తన యజమాని(శశిథరూర్), తాను కలిసి హత్య చేసినట్లు ఒప్పుకోవాలంటూ బలవంతపెట్టారని ఆ లేఖలో థరూర్ ఆరోపించారు. ‘నవంబర్ 7న నలుగురు పోలీసు అధికారులు 16 గంటల పాటు, ఆ మర్నాడు 14 గంటల పాటు మా పనిమనిషి నారాయణ్ సింగ్‌ను విచారించారు. ఆ సమయంలో ఆ అధికారుల్లో ఒకరు నేరాన్ని ఒప్పుకోవాలంటూ పదేపదే నారాయణ్‌ను శారీరకంగా దారుణంగా హింసించారు’ అని ఆ లేఖలో థరూర్ పేర్కొన్నారు.
కాగా, సునందది హత్యేనని నమ్మేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని బుధవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. సునందకేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసి, పని ప్రారంభించిందని వెల్లడించారు. థరూర్‌ను ప్రశ్నించే అవకాశాలను బస్సీ కాదనలేదు. మృతి చెందిన సంవత్సరం తరువాత హత్య కేసు నమోదు చేయడంపై స్పందిస్తూ.. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం అందించిన తుది నివేదిక ఆధారంగా ఇప్పుడు హత్య కేసు నమోదు చేశామని, తదుపరి పరీక్షలకు ఆమె శాంపిల్స్‌ను విదేశాలకు పంపేందుకు కేసునమోదు అవసరమన్నారు.
తన పనిమనిషిని హింసించారన్న థరూర్ ఆరోపణలపై వివరణ ఇస్తూ.. వాటిని పరిశీలిస్తామన్నారు. కాగా, సునంద విష ప్రభావంతో మరణించారని మాత్రమే తమ ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నామని, అది హత్య అయ్యే అవకాశం గురించి సమాచారం ఇవ్వలేదని ఎయిమ్స్ మెడికల్ బోర్డు చీఫ్ సుధీర్ గుప్తా పేర్కొన్నారు. థరూర్‌ను, ఆయన బంధువులను సిట్ విచారించే అవకాశముందని సమాచారం. సునంద చనిపోవడానికి 3రోజుల ముందుచికిత్స పొందిన తిరువనంతపురం ఆస్పత్రిలోనూ విచారణ జరిపి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతున్నారని, వారికి తాము ఆదేశాలివ్వలేదని కేంద్రం తెలిపింది.