
ఆ భాగస్వామ్యం మాకు ముఖ్యం కాదు!
ఘజియాబాద్:కశ్మీర్ వేర్పాటువాద నేత, ముస్లింలీగ్ నాయకుడు మసరత్ అలంను ప్రభుత్వం విడుదల చేయడంపై జమ్మూ కశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు అంతకంతకూ ముదిరి పాకాన పడుతున్నాయి. కశ్మీర్ ప్రభుత్వ చర్య తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తమకు అక్కడి ప్రభుత్వంతో భాగస్వామ్యం కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ సామాజిక భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయాన్ని నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పానని, మరోసారి దానికే కట్టుబడి ఉన్నానని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ-పీడీపీల మధ్య భిన్నమైన వాతావరణం నెలకొనడంతో వారి భాగస్వామ్యం కడవరకూ కొనసాగుతుందా?అనేది పలు సందేహాలకు తావిస్తోంది.