న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(మసరత్ ఆలం)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సాయపడుతూ దేశ వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. ‘‘ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచే ఎలాంటి సంస్థలు, శక్తులనైనా కేంద్రం ఊరికే వదిలిపెట్టదు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద ఈ సంస్థపై చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్‌లో భారత వ్యతిరేక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఉగ్రవాదులకు సాయపడుతూ, జనాన్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత అతివాద హురియత్ కాన్ఫెరెన్స్‌కు మసరత్ చైర్మన్‌గా ఉన్నారు. 2010లో కశ్మీర్ అల్లర్లకు బాధ్యుల్లో భట్ కూడా ఒకరు. దీంతో అదే ఏడాది భట్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భట్‌ను విడిపించారు. బీజేపీ ఒత్తిడితో అరెస్ట్‌చేసి జైలులో పడేశారు.
Comments
Please login to add a commentAdd a comment