న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు అత్యధికంగా 3.2 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజులో ఇంత భారీసంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. జూలై 14 వరకు దేశంలో 1,24,12,664 శాంపిల్స్ పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ పరీక్షలు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రతి పదిలక్షల మందికి 8994.7 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జూలై 14 వరకు మొత్తం 1,24,12,664 శాంపిల్స్ పరీక్షించగా, ఒక్క మంగళవారమే 3,20,161 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ వర్మ తెలిపారు. మే 25న రోజుకి 1.5 లక్షలకు పైగా ఉన్న కోవిడ్ పరీక్షా సామర్థ్యం మంగళవారానికి 4 లక్షలకు చేరుకున్నట్టు శర్మ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి దేశం, ప్రతి పదిలక్షల మందికి రోజుకి 140 మందికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 865, ప్రైవేటు రంగంలో 358.. మొత్తం కలిపి 1,223 పరీక్షా కేంద్రాలున్నాయి.
24 గంటల్లో 29,429 కేసులు
దేశంలో వరుసగా నాలుగో రోజు 28 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో కొత్తగా 29,429 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. అలాగే 582 మంది బాధితులు కరోనా మహమ్మారితో పోరాడుతూ మృతి చెందారు. ఇప్పటిదాకా మొత్తం కేసులు 9,36,181కు, మరణాలు 24,309కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,19,840 కాగా, 5,92,031 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 63.24 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం 1,24,12,664 కరోనా టెస్టులు నిర్వహించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment