న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 65,002 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కు చేరుకుంది. గత 24 గంటల్లో 996 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 49,036కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,08,936 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,68,220గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 26.45శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 71.61 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాల రేటు 1.94 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 996 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 364 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. ఆగస్టు 14 వరకు 2,85,63,095 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలి పింది. శుక్రవారం రికార్డు స్థాయిలో 8,68,679 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు 10 లక్షల పరీక్షలు చేయడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. ఆగస్టు 7 నుంచి ఒక్క 11వ తేదీన తప్ప ప్రతీ రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా కోసం ఆ ఔషధం
కరోనాపై బైపోలార్ వ్యాధికి ఉపయోగించే ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తోందని అమెరికా నిపుణులు వెల్లడించారు. అయితే దీనిని కేవలం కంప్యూటర్ సిమ్యులేషన్స్ మీద మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పరిశోధనా వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బైపోలార్, వినికిడి సమస్యలు, యాంటీ వైరల్‌గా ఉపయోగించే మందు ఎబ్సెలెన్ కరోనాను కట్టడి చేయగలుగుతోందని పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్‌లో ఎంపీఆర్‌ఓ అనే ప్రొటీజ్ ఉంటుందని దానిపై ఎబ్సెలోన్ చక్కగా పనిచేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment