ఇక సులువుగా గన్ లైసెన్స్
మూడు డజన్ల పేపర్లు.. రకరకాల పరీక్షలు.. నెలల తరబడి నిరీక్షణ.. ఇకపై ఇవన్నీ మర్చిపోయి గన్ లైసెన్స్ సులువుగా పొందమని కేంద్ర హోం మంత్రత్వశాఖ చెబుతోంది. ఇందుకోసం 56 ఏళ్ల నాటి ఆయుధ చట్టాల్ని కూడా సవరించింది. అప్లికేషన్ ఫాం నుంచి దాదాపు పాతిక పేపర్లను తొలిగిస్తున్నట్లు, అప్లై చేసుకున్న నెల నుంచి మూడు నెలల లోగా తుపాకి లైసెన్స్ ఇచ్చేందుకు శాఖా పరంగా సన్నద్దమైనట్లు గురువారం కేంద్ర మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది.
కొత్త అప్లికేషన్ ఫాంలో పూరించవలసిన కాగితాలు పదికి మించి ఉండవని, పోలీస్ వెరిఫికేషన్ కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయనున్నట్లు పేర్కొంది. ఇన్నాళ్లూ ఓ సుధీర్ఘ ప్రహాసనంలా సాగిన గన్ లైసెన్సుల జారీ తాజా ఉత్తర్వులతో సులభతరం కానుంది. అయితే తుపాకి ఉపయోగించడంలో ట్రైనింగ్ లేదా ఏదేనీ షూటింగ్ క్లబ్ నుంచి గుర్తింపు పత్రం సమర్పణను తప్పనిసరి. ప్రతి లైసెన్సుకు యునీక్ ఐడెంటిటీ నంబర్ (యూఐఎన్) కేటాయిస్తామని, 2015, అక్టోబర్ 1లోగా యూఐఎన్ పొందని లైసెన్సులను అక్రమమైనవిగా పరిగణిస్తామని హోంశాఖ అధికారులు తెలిపారు.